-సఫారీ బోర్డు ఆర్థిక కష్టాలను తీర్చనున్న భారత్..
-మూడు ఫార్మాట్ల సిరీస్‌ల ద్వారా భారీ ఆదాయం!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్న బీసీసీఐ.. ప్రపంచ క్రికెట్‌లో పెద్దన్న పాత్ర పోషిస్తున్నది. ఆదాయంపరంగా బీసీసీఐతో సరితూగే బోర్డు దరిదాపుల్లో కూడా లేదు. ఐసీసీకి వచ్చే ఆదాయంలో సుమారు 1/3వ వంతు బీసీసీఐ నుంచి వచ్చేదే. భారత్‌లోనే కాదు.. ఇతర దేశాల్లో భారత జట్టు క్రికెట్ ఆడినా ఆ బోర్డులకు కాసుల గలగలలే.. ఇదే క్రమంలో త్వరలో దక్షిణాఫ్రికాతో మూడు ఫార్మాట్ల సిరీస్ ఆడబోయే టీమిండియా, దక్షిణాఫ్రికా క్రికెట్ అసోసియేషన్ (సీఎస్‌ఎ) మూడేండ్ల నష్టాల నుంచి బయటపడేయనుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
సౌతాఫ్రికా బోర్డు గత కొన్నాళ్లుగా ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్నది. అయితే భారత్‌తో టీ20, వన్డే, టెస్టు సిరీస్ ద్వారా సుమారు మూడేండ్ల నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉందని స్థానిక క్రికెట్ పండితులు చెబుతున్నారు. మూడు ఫార్మాట్లలో భారత్ సుమారు 30 రోజుల పాటు సౌతాఫ్రికాలోనే గడపాల్సి ఉంది. ఈ నెల రోజుల్లో భారత్‌తో ఆడే మ్యాచ్‌ల ద్వారా సౌతాఫ్రికాకు 68.7 యూఎస్ మిలియన్ డాలర్ల ఆదాయం చేకూరనున్నట్టు తెలుస్తున్నది. ఒక్కో మ్యాచ్ ద్వారా 8.6 యూఎస్ మిలియన్ డాలర్ల ఆదాయం రానుందని అంచనా.
క్రికెట్ సౌతాఫ్రికా గత మూడేండ్లలో తమ నష్టాలను 6.3 మి.డా, 10.5 మి.డా, 11.7 మి.డా నష్టాలను చవిచూసింది. భారత్‌తో సిరీస్‌ల ద్వారా ఈ నష్టాలను పూడ్చుకోనుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఐపీఎల్ ద్వారా విశ్వవ్యాప్తమైన భారత క్రికెటర్ల ఆటను చూడటానికి వచ్చేవారిలో సౌతాఫ్రికా అభిమానులు కూడా ఉన్నారు. తద్వారా సౌతాఫ్రికా బోర్డు నష్టాల నుంచి బయటపడే అవకాశముందని విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. ఈ ఏడాది నుంచి సౌతాఫ్రికాలో మొదలైన ఎస్‌ఎ 20 (టీ20 లీగ్) ద్వారా ఆ బోర్డును భారత్ ఆదుకున్న విషయం తెలిసిందే. ఎస్‌ఎ 20లో ఉన్న ఆరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఓనర్లే దక్కించుకున్నారు.