Nitha Ambani Donates | రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) చైర్మన్ ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ (Nitha Ambani) తెలంగాణలోని బల్కంపేట ఎల్లమ్మ (Balkampet Yellamma Temple) ఆలయానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని బుధవారం ఆలయ బ్యాంకు ఖాతాలో జమ చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ తన తల్లి పూర్ణిమ దలాల్, సోదరి మమతతో కలిసి ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ సమయంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి కృష్ణ ఆలయ విశిష్టతను నీతా అంబానికి వివరించి, ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
దీంతో నీతా అంబానీ ఆలయానికి కోటి రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసి, దాని ద్వారా వచ్చే వడ్డీతో రోజూ అన్నదానం కార్యక్రమం చేపట్టనున్నట్లు ఆలయ ఇన్‌చార్జ్ ఈఓ మహేందర్ గౌడ్ తెలిపారు. కాగా, జూలై 1 నుంచి బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో కల్యాణ మహోత్సవం జరుగనుంది.









