Balkampet Ellamma Temple | హైదరాబాద్ లో సుప్రసిద్ధ దేవాలయం బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం ఘనంగా అమ్మవారి కళ్యాణం జరిగిన విషయం తెలిసిందే.
ఈ వేడుకను కళ్లారా చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. తోపులాటలో కొంతమంది భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Srinivas Yadav) బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి ఉత్సవాల ప్రారంభం సందర్భంగా మంత్రి ఆలయాన్ని సందర్శించారు. అధికారులు, పోలీసులు, పార్టీ నాయకులతో కలిసి ఆలయానికి వస్తున్న క్రమంలో మంత్రి తలసాని ఆలయ ప్రాంగణంలో ఉమ్మి వేశారు.
ఇదంతా అక్కడ తీస్తున్న వీడియోలో రికార్డైంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షలాది మంది భక్తులు ఎంతో పవిత్రంగా కొలిచే బల్కం పేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఇలాంటి పాడుపనేంటని నెటిజన్లు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పవిత్ర స్థలంలో భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా మంత్రి ఉమ్మి వేయడాన్ని భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారు. భక్తులు ఆలయాన్ని ఎంత పవిత్రంగా భావిస్తారో కనీసం తెలియదా అని మంత్రిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
మంత్రి తన చర్యతో భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వాపోతున్నారు. తలసాని వెంటనే భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఆలయాన్ని వెంటనే శుద్ధి చేయించాలని కోరుతున్నారు.










