Nara Lokesh News Latest | అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని నేతలకు సూచించారు రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించేందుకు మంగళగిరిలోని జాతీయ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో లోకేష్ పాల్గొని ప్రసంగించారు.
“సుపరిపాలనలో- తొలి అడుగు” కార్యక్రమాన్ని నెల రోజుల పాటు ఇంటింటికీ తీసుకెళ్లి విజయవంతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు.
ఎన్నికల్లో 94 శాతం సీట్లను ప్రజలు గెలిపించారని దీనికి ప్రధాన కారణం గత పాలకులకు ఉన్న అహంకారం, వారి పని విధానమని పేర్కొన్నారు. అందుకే కూటమిని పెద్దఎత్తున ఆశీర్వదించారన్నారు.
ఈ గెలుపు వెనుక కార్యకర్తల కష్టం చాలా ఉందని అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్లే వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషిచేయాలని వివరించారు.









