N. Ramachander Rao News Latest | ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయేసరికి మనస్తాపం చెంది సిరిసిల్ల జిల్లాకు చెందిన శ్రీకాంత్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని భావోద్వేగానికి లోనయ్యారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్ర రావు.
ఈ కష్టసమయంలో శ్రీకాంత్ కుటుంబ సభ్యులకి ధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చి దశాబ్దం గడుస్తున్నా ఇంకా ఈ యువకుల ఆత్మహత్యలు ఆగకపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు యువకులకు అనేక వాగ్దానాలు చేసి, నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగం, నిరుద్యోగ భృతి, యువ వికాసం పథకం అని ఎన్నో మాయ మాటలు చెప్పి, వారిని మభ్య పెట్టి, మోసం చేసి.. నేడు అధికారం వచ్చిన తరువాత,వారి సమస్యలను పట్టించుకోకుండా, యువకులను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్లనే శ్రీకాంత్ లాంటి యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. నాడు బీఆరెస్ ప్రభుత్వం అయినా, నేడు తెలంగాణ ప్రభుత్వం అయినా.. పాలకులే మారారు తప్ప, వీరి పాలన మారలేదు.. తెలంగాణ ప్రజల పరిస్థితీ మెరుగుపడలేదని ధ్వజమెత్తారు.
తెలంగాణ యువత, నిరుద్యోగులు నిరాశపడవద్దని, తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని రామచంద్ర రావు విజ్ఞప్తి చేశారు.










