AP CM YS Jagan | ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి (AP CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) సంచలన ప్రకటన చేశారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ఉంటాననీ, పరిపాలన కూడా ఇక్కడి నుండి చేయనున్నట్లు స్పష్టం చేశారు.
అంతేకాకుండా రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా వైజాగ్ లోనే చేస్తానని ప్రకటించారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ నగరాన్ని కోల్పోవడం రాష్ట్రంపై ఎంతో ప్రభావం చూపిందని సీఎం అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ‘విజన్ విశాఖ’ పేరుతో ఏర్పాటు చేసిన సదస్సులో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. హైదరాబాద్ కంటే మిన్నగా విశాఖ అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. కోర్టు కేసులతో ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
స్వప్రయోజనాల కోసం విశాఖ పై కూడా కొంతమంది విషం చిమ్ముతున్నారని విమర్శించారు. అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదనీ, శాసన రాజధానిగా అది కొనసాగుతుందని పేర్కొన్నారు.
కానీ మౌలిక వసతుల కోసం అమరావతిలో రూ. లక్ష కోట్లు అవసరమన్నారు. ఏపీలో నిరుద్యోగం తగ్గిందని, ఉపాధి అవకాశాలు పెరిగాయని తెలిపారు సీఎం జగన్.