MP Sanjay Raut says former VP Jagdeep Dhankhar may have gone missing | మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆచూకీ మరియు ఆరోగ్యం గురించి సమాచారం కోరుతూ శివసేన యూబీటి నేత సంజయ్ రౌత్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు.
ఈ విషయం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జులై 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజున, జగదీప్ ధన్ ఖడ్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖలో ఆరోగ్య కారణాలను పేర్కొన్నారు, వైద్యుల సలహా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఆయన రాజీనామాపై విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో సంజయ్ రౌత్ ధన్‌ఖడ్ ఆచూకీ, ఆరోగ్యం, మరియు భద్రత గురించి సమాచారం కోరుతూ అమిత్ షాకు లేఖ రాశారు. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామా చేసిన తర్వాత నుండి ఆయన ఎక్కడ ఉన్నారనే సమాచారం లేదని, రాజ్యసభ సభ్యులు ఆయనను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని సంజయ్ రౌత్ లేఖలో వెల్లడించారు.
ధన్‌ఖడ్ ఆరోగ్యం ఎలా ఉంది, ఆయన సురక్షితంగా ఉన్నారా అనే విషయంపై స్పష్టత లేదని రౌత్ పేర్కొన్నారు. ధన్‌ఖడ్ ఆచూకీ గురించి సమాచారం అందకపోతే, సుప్రీం కోర్టులో హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్లు రౌత్ హెచ్చరించారు.
అయితే అంతకు ముందు అమిత్ షాతో సమాచారం కోరడం మంచిదని భావించినట్లు చెప్పారు. మాజీ ఉపరాష్ట్రపతి గురించి నిజం తెలుసుకోవడం దేశ ప్రజల హక్కు అని ఈ విషయంలో స్పష్టత అవసరమని రౌత్ స్పష్టం చేశారు. మన మాజీ ఉపరాష్ట్రపతికి నిజంగా ఏం జరిగింది? అని ప్రశ్నించారు. కాగా శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా గత వారం ధన్‌ఖడ్ ఆచూకీపై ప్రశ్నలు లేవనెత్తారు.









