Eatala Rajendar in Lagacharla Incident | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar). రేవంత్ రెడ్డికి ఓటు వేయడంతో కొడంగల్ నియోజకవర్గ రైతుల పరిస్థితి కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉడినట్టు అయిందన్నారు.
కాంగ్రెస్ నాయకులే లగచర్ల ఘటనకు స్కెచ్ వేసుకుని ఈ దాడులు చేయించారని ఆరోపించారు. సీఎం రేవంత్ సోదరుడి అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయని విమర్శించారు. రూ. 50 లక్షల విలువైన భూమిని రూ. 10 లక్షలు ఇచ్చి లాక్కోవాలని చూస్తున్నారని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.
“144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారు. పార్లమెంట్ లో ప్రివిలేజ్ మోషన్ వేస్తాం. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు. కానీ బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటి?
నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుంది. రైతుకు సంకెళ్లు, థర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదు. ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడు. అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ల కోసం భూములు ఇస్తే ఊరుకోబోం”‘ అని హెచ్చరించారు.