- మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన!
Free Bus Travel For Women | మంత్రి శ్రీధర్ బాబు, కేబినెట్ మీటింగ్, తెలంగాణ కేబినెట్ సమావేశం, మహిళలకు ఫ్రీ బస్, తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వంలో గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తొలి కేబినెట్ సమావేశం నిర్వహించారు.
తెలంగాణ సెక్రటేరియట్ లో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ మీడియా కేబినెట్ సమావేశంలో చర్చించిన అంశాల గురించి వివరించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. రానున్న వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
డిసెంబర్ 9న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలను అమలు చేయనున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు.
మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం, ఆరోగ్య శ్రీలో బీమా మొత్తాన్ని రూ. 10 లక్షలకు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళ.. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించొచ్చని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ప్రకటించారు. విద్యుత్ శాఖపై శుక్రవారం సీఎం సమీక్ష చేస్తారని చెప్పారు. తెలంగాణలో 24 గంటల కరెంట్ తప్పకుండా కొనసాగిస్తామని హామీ ఇచ్చారు.
డిసెంబర్ 9న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే రోజు ఎమ్మెల్యేలు ప్రమాణం స్వీకరిస్తారని చెప్పారు.