Helicopter Service To Medaram | మేడారం (Medaram Jathara)లోని సమ్మక్క సారలమ్మ (Sammakka Saralamma) ను దర్శనం చేసుకోవడానికి వచ్చే భక్తులు హెలికాప్టర్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (minister Seethakka) తెలిపారు.
గతంలో కాలినడక నుండి కార్ల మీద వచ్చిన భక్తులు నేడు ఎడ్ల బండ్లను వదిలి హెలికాప్టర్ పై రావడానికి సిద్ధమవుతున్నారని అన్నారు.
గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని డిగ్రీ కళాశాల ఆవరణలో తంబి సంస్థ హెలికాప్టర్ సేవలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవార్లను సత్వరమే దర్శనం చేసుకోవడానికి సమయం వృథా కాకుండా హెలికాప్టర్ సేవలను రాష్ట్ర పర్యాటక శాఖ చేపట్టిందని తెలిపారు.
హనుమకొండ జిల్లా కేంద్రం నుండి మేడారం వరకు, తిరిగి మేడారం నుండి హనుమకొండ కు వెళ్లేందుకు అతి తక్కువ ధరలలో ఒక్కొక్కరికి 31 వేల రూపాయల టికెట్ నిర్ణయించిందని వెల్లడించారు. అంతేకాకుండా మేడారం పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా పర్యటించడానికి రూ.4800 ను ఖరారు చేశారని వివరించారు.
గతంలో మహా జాతర సందర్భంగా అప్పటి పాలకులు నామమాత్రంగా నిధులు కేటాయించగా నేడు రాష్ట్రంలోని ప్రజాప్రభుత్వం గద్దెల పునరుద్ధరణ పనులతో పాటు అభివృద్ధి కార్యక్రమాల కోసం 2 వందల 51 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు తెలిపారు. నేటి నుండి ఈ నెల 31 వరకు వీరి సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు.









