Komatireddy Venkat Reddy | బీఆరెస్ అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్రంలో బస్సు యాత్ర కాదు కదా.. మోకాళ్ళ యాత్ర చేసిన భువనగిరి, నల్లగొండలో డిపాజిట్ కూడా దక్కదని ఎద్దేవా చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితకు బెయిల్ దొరకదన్నారు. త్వరలో తండ్రీకొడుకులు కూడా జైలుకెళ్లడం ఖాయమని విమర్శించారు.
మంగళవారం ఆయన నల్లగొండలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీలకు కాలం చెల్లిందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి చేయలేని వారు ఇప్పుడేం చేస్తారని మంత్రి ప్రశ్నించారు.
“పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలలో గెలుపొందుతాం. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన సీఎం కేసీఆర్, మంత్రిగా ఉన్న జగదీశ్ రెడ్డి వేలకోట్లు సంపాదించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాను భ్రష్టు పట్టించిన సంస్కారహీనుడు జగదీష్ రెడ్డి గురించి ఇక మాట్లాడను. నా స్థాయిని దిగదార్చుకోను.
పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత నల్లగొండ నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటిని వేగవంతం చేస్తా. రాష్ట్రంలో పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం. నాకు రాజకీయ జన్మనిచ్చిన నల్లగొండ నియోజక వర్గాన్ని ఎన్నటికి మరువను.
అసెంబ్లీ ఎన్నికలలో నన్ను గెలిపించిన విధంగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ మెజార్టీతో రఘువీర్ రెడ్డిని గెలిపించాలి. సీఎం రేవంత్ రెడ్డితో తామంతా రాష్ట్ర అభివృద్ధి కోసం టీం వర్క్ గా పని చేస్తున్నాం. ఇటీవల నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిని సందర్శించి గర్భిణీలు, చిన్నపిల్లలు ఉండే వార్డుకు ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా 32 ఏసీలు పెట్టించాను.
ఎండ వేడితో వారంతా ఇబ్బందులు పడుతున్నారు. త్వరలో సూర్యాపేట, ఖమ్మం ఆస్పత్రులను సందర్శించి అక్కడ కూడా ఎయిర్ కండిషన్లను ఏర్పాటు చేయిస్తా. రాష్ట్రంలోని అన్ని ఐటిఐ లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తాం. రేపు జరిగే రఘువీర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు అంత పెద్ద సంఖ్యలో తరలిరావాలి” అని పిలుపునిచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.