- ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయం కావాలి: మంత్రి జూపల్లి
- కొల్లాపూర్‌లో అత్యాధునిక డిజిటల్ లైబ్రరీని ప్రారంభించిన మంత్రి
Minister Jupally Krishna Rao | గ్రంథాలయాలు జ్ఞానానికి నిలయాలే కాకుండా సమాజాన్ని సంస్కరించే ఆధునిక దేవాలయాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు.
పుస్తక పఠనాసక్తి కలిగిన వ్యక్తుల ఆలోచన విధానం, గుణగణాలు సమాజహితంగా ఉంటాయని పేర్కొన్నారు. సమాజంలోని రుగ్మతలను నిర్మూలించే శక్తి పుస్తకాలకే ఉందని, ప్రతి ఇల్లు ఒక చిన్న గ్రంథాలయంగా మారాలన్నదే తన ఆకాంక్షగా మంత్రి తెలిపారు.
కొల్లాపూర్ పట్టణంలో సి.ఎస్.ఆర్ నిధులతో ఆధునీకరించిన డిజిటల్ గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్‌తో కలిసి గురువారం మంత్రి జూపల్లి ప్రారంభించారు. అధునాతన కంప్యూటర్లు, విస్తృత గ్రంథ సంపద, దినపత్రికల ఈ గ్రంథాలయంలో అందుబాటులోకి తెచ్చారు..
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… దినపత్రికలు చదవడాన్ని ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా మార్చుకోవాలి. విద్యార్థులు, యువత గ్రంథాలయాలను జ్ఞానార్జన కేంద్రాలుగా ఉపయోగించుకోవాలి.
పోటీ పరీక్షల్లో ప్రతిభ సాధించేందుకు అవసరమైన పుస్తకాలు, మ్యాగజైన్లు, దినపత్రికలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి అని సూచించారు.
జిల్లా కేంద్రంలో కూడా ఈ స్థాయిలో ఆధునిక గ్రంథాలయం లేదని పేర్కొన్న మంత్రి, కొల్లాపూర్ పట్టణంలోని రిటైర్డ్ ఉద్యోగులు, విద్యార్థులు, యువతీ యువకులు ఈ డిజిటల్ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
భవిష్యత్తులో మరిన్ని ఆధునాతన పుస్తకాలు, మౌలిక వసతులు కల్పించి, రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందేలా గ్రంథాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ… గ్రంథాలయాల వినియోగంతో వ్యక్తిగత జ్ఞానం మాత్రమే కాకుండా సామాజిక అవగాహన కూడా పెరుగుతుందని తెలిపారు.
ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను నిత్యం సందర్శించి పుస్తకాలు, దినపత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ ఆర్‌డీఓ బన్సీలాల్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.









