Latest News | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీరు చర్చనీయాంశంగా మారింది. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా మధ్యవర్తిత్వం వహించినట్లు ట్రంప్ శనివారం ప్రకటించారు.
అలాగే ఇరుదేశాలు అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు అంగీకరించాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో భారత్-పాక్ కామన్ సెన్స్ ను ఉపయోగించి నిర్ణయం తీసుకున్నందుకు ఇరుదేశాలను ట్రంప్ అభినందించారు.
మరోవైపు ఇరుదేశాల ‘డైరెక్టర్ జెనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్’ స్థాయి అధికారులు శనివారం సాయంత్రం 3.35 గంటల సమయంలో నేరుగా మాట్లాడుకుని, సైనిక కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రం మిస్రి స్పష్టం చేశారు.
శనివారం సాయంత్రం కాల్పుల విరమణ అమల్లోకి వస్తుందని తెలిపారు. భూ, గగనతల, సముద్రజలాల్లో అన్ని రకాల కాల్పులు, సైనిక చర్యల్ని రెండు దేశాలు నిలిపివేస్తాయని, దీనికి పాక్ బేషరతుగా అంగీకరించిందని మిస్రి పేర్కొన్నారు. అలాగే మే 12 మధ్యాహ్నం 12 గంటలకు భారత్-పాక్ అధికారులు చర్చలు జరుపుతారని వివరించారు.
అయితే అమెరికా మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ జరిగిందని ఆయన ఎక్కడా ప్రస్తావించలేదు. అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ట్రంప్ ప్రకటించారు, కానీ భారత్ మాత్రం అగ్రరాజ్య మధ్యవర్థిత్వాన్ని ప్రస్తావించకపోవడం గమనార్హం.
మరోవైపు ఇరుదేశాలు సంయవనం పాటించాలని చైనా, సౌదీ మరియు జీ-7 దేశాలు విజ్ఞప్తి చేశాయి. ఇదిలా ఉండగా కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే పాక్ తన వక్రబుద్దిని మరోసారి చూపింది. శనివారం రాత్రి సరిహద్దు వెంట పలు ప్రాంతాల్లో పాక్ దాడులకు పాల్పడింది.
భారత సైన్యం సమర్ధవంతంగా వీటిని తిప్పికొట్టింది. కాల్పుల విరమణ జరిగిన కొన్ని గంటల తర్వాత శ్రీనగర్ లో పేలుడు శబ్దాలు విన్నట్లు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించిన వెంటనే సైన్యం గుజరాత్, రాజస్థాన్, కశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఔట్ ను విధించారు.










