KTR News Latest | తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని శాసనసభ స్పీకర్ కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేస్తూ తీర్పు వెలువరించిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున్నదని వెల్లడించారు. కొంతమంది ప్రజాప్రతినిధులు అడ్డదారులు తొక్కినంత మాత్రాన భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థ నాశనం కాదని సుప్రీంకోర్టు నిరూపించిందని ఈ నేపథ్యంలో న్యాయస్థానానికి ధన్యవాదాలు తెలియజేశారు.
పార్టీ మారిన పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మరింత విచారణ అవసరం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో ప్రతిరోజు పాల్గొంటున్న ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన వెంటనే అనర్హత విధిస్తూ నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రానున్న మూడు నెలల కాలంలో 10 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలకు బీఆరెస్ పార్టీ సిద్ధం అవుతుందని, ఈ దిశగా పని చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నిజాయితీ ఉంటే అనర్హత వేటు విషయంలో ‘పాంచ్ న్యాయ’ పేరుతో చెప్పిన నీతులను ఆచరణలో చూపించాలని కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీకి కేటీఆర్ సవాలు విసిరారు.









