KTR News Latest | బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని పేర్కొన్నారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
బోధించు, సమీకరించు, పోరాడు, అన్న బాబాసాహెబ్ బాటలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆరెస్ అధినేత కేసీఆర్ ఉద్యమించారని తెలిపారు. లక్షలాది మందిని సమీకరించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవసరాన్ని వాళ్లకు బోధించి, ఎత్తిన జెండా దించకుండా 14 ఏళ్ల పాటు కేసీఆర్ కొట్లాడితే బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగా తెలంగాణ వచ్చిందన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును సెక్రటేరియట్ కు పెట్టిన ఒకే ఒక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ ఒక్కరే అని, అంబేద్కర్ ను అంత గొప్పగా గౌరవించుకున్న ముఖ్యమంత్రి దేశంలో ఇంకెవరూ లేరని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఈ మేరకు శుక్రవారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని లింగంపేటలో జరిగిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పచ్చి దళిత, గిరిజన వ్యతిరేకి అని విమర్శలు గుప్పించారు. ఈ శతాబ్దపు అతిపెద్ద అబద్ధం కాంగ్రెస్ మ్యానిఫెస్టో అని, రేవంత్ ప్రభుత్వ చేతిలో తెలంగాణలోని అన్ని వర్గాలు మోసపోయాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలనలో తెర్లు అయిన తెలంగాణను మళ్లీ బాగు చేసుకోవాలంటే కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిందే అని అన్నారు.









