KTR News Latest | కేంద్రమంత్రి బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ లకు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిన విషయం తెల్సిందే. నోటీసులు అందిన ఐదు రోజుల్లోగా స్పందించని పక్షంలో సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. తన కుటుంబం ఫోన్ ట్యాపింగ్ ద్వారా రూ.వేల కోట్లు సంపాదించిందని, సెలబ్రిటీల ఫోన్లు ట్యాప్ చేశారంటూ జనవరి 23న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారని అవి పూర్తిగా అవాస్తవమని తెలిపారు. ఇప్పటికే బండి సంజయ్‌పై సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా నడుస్తున్నప్పటికీ, మళ్ళీ అదే తరహాలో తప్పుడు ఆరోపణలు చేయడం దురుద్దేశపూర్వకమని మండిపడ్డారు.
మరోవైపు ఎంపీ ధర్మపురి అరవింద్‌కు పంపిన నోటీసులో ఆయన తనపై వ్యక్తిగత దూషణలు చేశారని పేర్కొంటూ వాటిని తప్పుబట్టారు. డ్రగ్స్ సేవించడం మరియు సరఫరా చేస్తున్నారంటూ ఆ వ్యాఖ్యలు అక్షేపణీయమని పేర్కొన్నారు. తనపై తన కుటుంబంపై నిరాధారమైన, పరువుకు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ నోటీసులు పంపినట్లు పేర్కొన్నారు. ఈ ఇద్దరు ఎంపీలు తమ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, బహిరంగంగా నిబంధనలు లేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే న్యాయపరంగా మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు.










