Komatireddy Rajagopal Reddy | తెలంగాణ రాజకీయాల్లో రోజూ ఏదో ఒక పరిణామం చోటు చేసుకుంటోంది. ఒక వైపు భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా, ఈటల రాజేందర్ ను ఎన్నికల నిర్వాహణ కమిటీ చైర్మన్ గా నియమించారు.
మరో వైపు పార్టీలోని నాయకుల పై అసంతృప్తి గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నేత ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరనున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులతో భేటీ అయ్యారు.
ఈ భేటిలో ఎటువంటి అంశాలు చర్చించనున్నారు అనేది ఆసక్తిగా మారింది. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేసి బీఆరెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తర్వాత పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
పార్టీ తనను సరిగ్గా వాడుకోవడం లేదని, అలాగే బీఆరెస్ పార్టీ చేసే అవినీతి పైన ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదని గుర్రుగా ఉన్నట్లు సమాచారం.
పార్టీలో బీఆరెస్ పట్ల వైఖరి మారకుంటే తన దారి తాను చూసుకుంటానని ఏకంగా దేశ హోంమంత్రి అమిత్ షా ముందే కుండబద్దలు కొట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.
అప్పటి నుండి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారనున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతుంది.
మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ పార్టీని వీడిన వారు తిరిగి పార్టీలోకి రావాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రియాంక గాంధీతో జరిగిన భేటీలో కూడా తన తమ్ముడు పార్టీలోకి వస్తారు అని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
బీజేపీలో పదవులు ప్రకటించి ఉత్సాహంలో ఉన్న బీజేపీలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ కలకలం రేపుతోంది.
మరి పొంగులేటి , జూపల్లి తో ఎటువంటి అంశాలు చర్చించనున్నారు, నిజంగా పార్టీ మారతారా అనేది తెలవాల్సి ఉంది.