Kerala man dies | కేరళలో ఓ విషాద ఘటన చోటు చేసుకుంది. బస్సులో ఓ వ్యక్తి తనను అసభ్యకరంగా తాకాడని ఆరోపిస్తూ ఒక మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఆ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మృతుడిని కోజికోడ్‌లోని గోవిందపురం నివాసి అయిన దీపక్ (40)గా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున అతను తన నివాసంలో విగతజీవిగా కనిపించాడు.
రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా లైంగిక దురుద్దేశంతో తన శరీరాన్ని తాకాడని ఆ మహిళ సోషల్ మీడియా ద్వారా ఆరోపించింది.
ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది, 2 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో ప్రచారంలోకి వచ్చిన తర్వాత, దీపక్ మానసికంగా తీవ్ర ఆందోళనకు గురయ్యాడని బంధువులు, స్నేహితులు తెలిపారు. ఈ వీడియో ద్వారా అతని వ్యక్తిత్వాన్ని కించపరిచారని అతని కుటుంబం ఆరోపించింది.
ఆ మహిళ సోషల్ మీడియాలో ప్రచారం కోసమే ఈ కంటెంట్‌ను సృష్టించిందని పేర్కొన్నారు. కోజికోడ్ మెడికల్ కాలేజ్ పోలీసులు అసాధారణ మరణం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.









