Kerala High Court stays release of Kerala Story-2 | దర్శకుడు కమాఖ్య నారాయణ్ సింగ్ తెరకెక్కించిన ‘ది కేరళ స్టోరీ-2: గోస్ బియాండ్’ సినిమా విడుదలపై కేరళ హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. ఫిబ్రవరి 27న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాలతో సినిమా విడుదల వాయిదా పడింది. సినిమాలో కేరళ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, మతసామరస్యానికి హాని కలిగించే విధంగా సినిమాలోని సీన్లు ఉన్నాయని పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. సినిమా విడుదలపై స్టే విధించాలని అలాగే సెన్సార్ సర్టిఫికేట్ ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు.
ఈ పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి బేచు కురియన్ థామస్ విచారణ చేపట్టారు. సినిమాటోగ్రఫ్ యాక్ట్ ప్రకారం సెన్సార్ బోర్డు మార్గదర్శకాలను పాటించలేదని న్యాయమూర్తి అభిప్రాయం వ్యక్తం చేశారు. సీబీఎఫ్సీ తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి సినిమాను పునఃపరిశీలించాలని సూచించారు. అప్పటివరకు సినిమా విడుదలపై స్టే విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.










