Nara Deer Crossing The Road | ప్రపంచంలోని దేశాలన్నింటిలో జపాన్ (Japan) చాలా ప్రత్యేకమైంది. ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, ప్రకృతి ప్రేమ, మానవత్వం కలగలిసిన దేశం అది. అక్కడి ప్రజలు క్రమశిక్షణకు మారుపేరులా ఉంటారు.
దేశం పట్ల వారికి ఉండే గౌరవం ఎలాంటి ఇప్పటికే చాలా సంఘటనలు చాటి చెప్పాయి. అయితే అక్కడి మనుషులే కాదు చివరికి జంతువులు కూడా క్రమశిక్షణగా ఉంటాయని నిరూపించింది ఒక జింక. నారా అనేది జపాన్‌లో ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రాంతం.
ఇక్కడి నారా పార్క్ (Nara Park) లో వందలాది జింకలు స్వేచ్ఛగా సంచరిస్తుంటాయి. ఆ జింకలను అక్కడి ప్రజలు కూడా చాలా గౌరవంగా చూసుకుంటారు. అవి కూడా మనుషులతో మమేకమై ఉంటాయి. ఆ దేశంలో ట్రాఫిక్ రూల్స్ ని జింకలు కూడా క్రమశిక్షణగా పాటిస్తాయనేదానికి ఈ వీడియో ఒక సాక్ష్యం. నారా ప్రాంతంలో ఓ జింక రోడ్డు దాటాలనుకుంది.
అందుకోసం అది ట్రాఫిక్ కాస్త నెమ్మదించేవరకు ఓపికగా రోడ్డు పక్కన నిలబడింది. అటు ఇటు చూసి వాహనాలు ఆగిన తర్వాతే జీబ్రా క్రాసింగ్ వద్దే రోడ్డు దాటింది! ఆ జింక క్రమశిక్షణకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.









