Janasena to vote in favour of Waqf (Amendment) Bill | వివాదాస్పద వక్ఫ్ సవరణ బిల్లు బుధవారం లోకసభ ముందుకు రానుంది. అయితే కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువస్తున్న ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఎన్డీయే మిత్రపక్షాలు మద్దతు పలికాయి.
ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ బిల్లుకు జనసేన మద్దతు తెలిపింది. ఈ చట్ట సవరణ ముస్లిం సమాజానికి మేలు చేస్తుందని జనసేన పార్టీ విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ మేరకు లోక్ సభలోని జనసేన ఎంపీలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఈ బిల్లుకు అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొనాలని జనసేన పార్లమెంట్ సభ్యులకు తెలిపారు.
వక్ఫ్ చట్టంలో సవరణలకు సంబంధించిన బిల్లును 31 మంది సభ్యులతో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి సమీక్షించారని, సంబంధిత వర్గాలతో, విద్యావంతులతో, పాలన రంగ నిపుణులతో చర్చించి ఈ బిల్లును రూపొందించారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
బ్రిటిష్ కాలంనాటి వక్ఫ్ చట్టాన్ని నేటి కాలానికి తగిన విధంగా క్రమబద్ధీకరించడం ద్వారానే విస్తృత ఫలితాలు దక్కుతాయన్నారు. ఈ క్రమంలో వక్ఫ్ సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.