Indian Railways Installs ATM On A Train | భారతీయ రైల్వేశాఖ వినూత్న ఆలోచనతో ముందుకువచ్చింది. రైళ్లలో ఏటీఎంలను ఏర్పాటు చేయాలని రైల్వేశాఖ భావిస్తోంది.
ప్రయోగాత్మకంగా ఓ రైలులో ఏటీఎం ను అధికారులు ఏర్పాటు చేశారు. సెంట్రల్ రైల్వే తొలిసారిగా ముంబయి-మన్మాడ్ పంచవటి ఎక్స్ప్రెస్ లో ఏటీఎం ను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. పంచవటి ఎక్స్ప్రెస్ ప్రతీరోజు ముంబయి లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినస్ నుంచి మన్మాడ్ వెళ్తుంది.
సుమారు నాలుగున్నర గంటల పాటు దీని ప్రయాణం కొనసాగుతుంది. ఈ మార్గంలో ఉండే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ముఖ్యం. ఈ నేపథ్యంలో భారతీయ రైల్వే దేశంలోనే తొలిసారిగా కదిలే రైల్లో అధికారులు ఏటీఎం ను ఏర్పాటు చేశారు. ఈ వినూత్న సేవను “ఏటీఎం ఆన్ వీల్స్”గా పిలుస్తున్నారు.
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంను రైలులోని ఒక ఎయిర్-కండిషన్డ్ చైర్ కార్ కోచ్‌లో గతంలో ప్యాంట్రీగా ఉపయోగించిన స్థలంలో ఏర్పాటు చేశారు. ఏటీఎం, వైబ్రేషన్స్ వల్ల దెబ్బతినకుండా బోల్ట్‌లతో బిగించి, రబ్బర్ ప్యాడ్‌లతో సురక్షితం చేశారు.
భద్రత కోసం షట్టర్ డోర్ సైతం ఏర్పాటు చేసి, రెండు ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌లను కూడా అమర్చారు. ఈ ప్రయోగం విజయవంతమైతే, భవిష్యత్తులో మరిన్ని రైళ్లలో ఏటీఎం సౌకర్యాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని రైల్వే అధికారులు తెలిపారు.