India recorded 51 ragging-related deaths in colleges from 2022 to 2024 | దేశవ్యాప్తంగా ర్యాగింగ్ భూతం మూలంగా 51 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ అనేది మరీ ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
‘సొసైటీ ఎగెనెస్ట్ వాయిలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ అనే సంస్థ తాజగా ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2022-24’ పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది. దీనిలో 2022-24 మధ్య ర్యాగింగ్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విశ్వవిద్యాలయాల్లో, కళాశాలల్లో 51 మరణాలు సంభవించినట్లు పేర్కొంది.
ర్యాగింగ్ ఉదంతాలు ఎక్కువగా వైద్య కళాశాలల్లో నమోదు అవుతున్నాయని వెల్లడైంది. యాంటీ ర్యాగింగ్ హెల్ప్ లైన్ కు 1946 కళాశాలల నుండి 3,156 కంప్లైంట్లు అందాయని సంస్థ తెలిపింది. అందిన ఫిర్యాదులో 38.6 శాతం మెడికల్ కాలేజీల నుండి వచ్చినవే. మెడికల్ కాలేజీల్లో ర్యాగింగ్ భూతం అధికంగా ఉందని సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ గణాంకాలు కేవలం హెల్ప్ లైన్ కు మాత్రమే అందినవి.
కాలేజీల్లో, స్థానిక పోలీస్ స్టేషన్లలో చేసిన ఫిర్యాదుల లెక్కలోకి తీసుకోలేదని, అవి కూడా లెక్కిస్తే ఈ సంఖ్య అధికంగా ఉంటుందని సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ నేపథ్యంలో కాలేజీల్లో యాంటీ ర్యాగింగ్ స్కాడ్ల ఏర్పాటు, హాస్టళ్లలో జరిగే ఘటనలపై దృష్టి పెట్టడం వంటి చర్యల మూలంగా ర్యాగింగ్ ను తగ్గించవచ్చని సూచించారు. మరోవైపు, రాజస్థాన్ కోటాలోని పోటీ పరీక్షల శిక్షణ కేంద్రాల ఒత్తిడి భరించలేక 2022-24 మధ్య కాలంలో ఏకంగా 57 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదికలో సంస్థ పేర్కొంది.