IAF pilot assaulted in Bengaluru road rage incident | ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్న అదిత్య బోస్ పై భౌతిక దాడి జరగడం కలకలం రేపుతోంది.
బోస్ మరియు ఆయన భార్య స్క్వాడ్రన్ లీడర్ మధుమిత బోస్ బెంగళూరులోని సీవీ రామన్ నగర్‌లో ఉన్న డీఆర్‌డీఓ కాలనీ నుంచి విమానాశ్రయం వైపు కారులో బయలుదేరారు. అయితే రోడ్డుపై వెళ్తున్న సమయంలో తాము ప్రయాణిస్తున్న కారును ఒక బైకర్ అడ్డగించి దూషించడం మొదలుపెట్టినట్లు వింగ్ కమాండర్ బోస్ వెల్లడించారు.
తన భార్యను కూడా దూషించడంతో తాను కారు నుంచి బయటకు వచ్చానని, వెంటనే బైకర్ ఒక కీతో తన నుదుటిపై దాడి చేశాడని, దీంతో తీవ్రంగా రక్తస్రావం అయిందన్నారు. ఈ ఘటనలో మరికొందరు వ్యక్తులు కూడా బైకర్‌కు మద్దతుగా చేరి, తమపై దాడి చేశారని, ఒక వ్యక్తి రాయితో కారు అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు.
ఈ దాడిలో బోస్‌కు ముఖం, మెడ, మరియు తలపై తీవ్ర గాయాలు అయ్యాయి. ఆయన భార్య మధుమిత కూడా ఈ ఘటనలో వేధింపులకు గురైనట్లు తెలిపారు. ఈ ఘటన తర్వాత బోస్ తన గాయాలతోనే ఒక వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“నేను దేశాన్ని రక్షించే సైనికుడిని, అయినా ఇలా దాడి చేయడం ఏమిటి? ఇదేనా సైనికుల పట్ల మీరు చూపే గౌరవం?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తే వారు పట్టించుకోలేదని వింగ్ కమాండర్ ఆరోపించారు. మరోవైపు తమకు ఎలాంటి సమాచారం అందలేదని ప్రస్తుతం ఏమి జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.