Hydraa Commissioner Ranganath | ఇటీవల కాలంలో కొంతమంది రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారులు ఫామ్ ల్యాండ్ల (Farm Lands) పేరుతో తక్కువ ధరకే భూములంటూ విక్రయాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అలాంటి భూములు కొనుగోలు చేసే వారికి హైడ్రా కమిషనర్ (Hydraa Commissioner) రంగనాథ్ (AV Ranganath) కీలక సూచనలు చేశారు.
ఓపెన్ ప్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనధికారిక లేఅవుట్లలో ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసి తర్వాత ఇబ్బందులకు గురికావొద్దని హితవు పలికారు. కొంతమంది ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేస్తూ ఫామ్ ల్యాండ్ పేరుతో దగా చేస్తున్నారని వెల్లడించారు.
హైడ్రా ప్రధాన కార్యాలయంలో (Hydraa Office) ఈ సూచనలు చేశారు. ‘సాధారణంగా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకుని లేఅవుట్‌ను అభివృద్ధి చేయాలి. అందుకోసం ప్రభుత్వానికి కొంత మెుత్తంలో ఫీజు కట్టాలి. అయితే ఆ ఫీజును తప్పించుకునేందుకు కొందరు వ్యాపారులు వ్యవసాయ భూములను ప్లాట్లుగా మార్చి ఫామ్ ల్యాండ్స్ పేరుతో విక్రయిస్తున్నారు.
నిబంధనల ప్రకారం ఫామ్ ల్యాండ్ అమ్మాలంటే.. కనీసం అర ఎకరా భూమిని విక్రయించాలి. అప్పుడే అలాంటి భూములు రిజిస్ట్రేషన్ అవుతాయి. కానీ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సర్కార్ ఆదాయానికి గండి కొడుతూ గజాల చొప్పున ఫామ్ ల్యాండ్స్ అమ్ముతున్నారు. వీటి రిజిస్ట్రేషన్లకు కొందరు అధికారులు సహకరిస్తున్నారు.
అలాంటి అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై చర్యలు తప్పవు. జీవో నంబరు 131 ప్రకారం 2020 నుంచి అనధికారిక లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి పర్మిషన్ కూడా ఇవ్వటం లేదు. ఎటువంటి పర్మిషన్ లేకుండా ఇండ్లు కడితే కూల్చివేతలు తప్పవు కడితే కూల్చేస్తాం.’ అని హైడ్రా కమిషనర్ ప్రజలకు సూచన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ భూముల్లో ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు.