Hydra Demolitions | హైదరాబాద్ నగరంలో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మెుదలయ్యాయి. కొంతకాలం కూల్చివేతలకు బ్రేక్ పడింది. కాగా బుధవారం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలో రెండు బృందాలు కూల్చివేతలు చేపట్టాయి.
రాంపల్లి సమీపంలోని రాజ్‌సుఖ్ నగర్ కాలనీలో మెయిన్ రోడ్డు పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. అక్రమ కట్టడాలను మాత్రమే నోటీసులు ఇచ్చి కూలుస్తామని.. అనవసరంగా ఆందోళన పడోద్దని స్థానికులకు హైడ్రా అధికారులు భరోసా ఇచ్చారు. మరోవైపు అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు.
బతుకమ్మ కుంట పునరుద్ధరణపై స్థానికులతో మాట్లాడారు. గతంలో 16 ఎకరాలు ఉన్న బతుకమ్మ కుంటలో నిర్మాణ వ్యర్థాలు పోసి ఆక్రమించడంతో ప్రస్తుతం 5.15 ఎకరాలకు కుచించుకుపోయిందని తెలిపారు. స్థానికుల విజ్ఞప్తితో చెరువు పునరుద్ధరణ పనులు చేపడతామని రంగనాథ్ వెల్లడించారు.
బతుకమ్మ కుంటలో ఎటువంటి కూల్చివేతలు ఉండవని చెప్పారు. కుంటను పునరుద్ధరిస్తామని.. ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దితే మీ నివాసాలకు విలువ పెరుగుతుందని చెప్పారు.