AI In Police Duties | సాంకేతికత వినియోగంలో నగర పోలీసులు మరో ముందడుగు వేశారు. సిటీ ఆర్మ్‌డ్ రిజర్వ్ (సీఏఆర్) సిబ్బంది విధుల కేటాయింపులో మానవ ప్రమేయం లేకుండా, పూర్తి పారదర్శకతతో కూడిన అత్యాధునిక ‘జనరేటివ్ ఏఐ’ (Generative AI) విధానానికి శ్రీకారం చుట్టారు.
బషీర్‌బాగ్ లోని పాత కమిషనర్ కార్యాలయంలో మంగళవారం నగర సీపీ వీసీ సజ్జనర్ (VC Sajjanar) ఉన్నతాధికారులతో కలిసి ఈ నూతన విధానాన్ని ప్రారంభించారు. గతంలో మాన్యువల్ పద్ధతిలో విధుల కేటాయింపు వల్ల జాప్యం జరగడంతో.. సమయం చాలా వృథా అయ్యేది.
వాటికి చెక్ పెడుతూ.. కేవలం రెండు నెలల్లోనే ఈ కొత్త సాంకేతికతను హన్ష ఈక్విటీ పార్ట్‌నర్స్ ఎల్ఎల్‌పీతో కలిసి జనరేటివ్ ఏఐ సాయంతో కొత్త విధానాన్ని ఉన్నతాధికారులు అభివృద్ధి చేశారు.
ఈ విధానం ద్వారా పైలట్ ప్రాజెక్ట్ కింద 1,796 దరఖాస్తులను పరిశీలించి.. సెక్రటేరియట్, సీఎం ఆఫీస్, ట్రాఫిక్ తదితర విభాగాలతో పాటు ఇంటర్‌సెప్టర్ వాహనాలకు సంబంధించిన 208 డ్యూటీలను సమర్థంగా కేటాయించడం జరిగింది.
ఈ క్రమంలో స్పందించిన సజ్జనర్ ‘హంగేరియన్ మెథడ్’ అనే సాంకేతిక పద్ధతి ద్వారా సిబ్బంది సీనియారిటీ, రిజర్వ్‌లో ఉన్న రోజులు, రివార్డులు, క్రమశిక్షణ, ఆరోగ్యం వంటి అంశాలను స్కోర్ ఆధారంగా పరిగణనలోకి తీసుకొని కంప్యూటరే విధులను ఖరారు చేస్తుందన్నారు.
ఇందులో అధికారుల జోక్యం అస్సలు ఉండదని పేర్కొన్నారు. ఓపెన్ ఏఐ సాయంతో డ్యూటీ అలాట్‌మెంట్ ఆర్డర్‌లు క్షణాల్లో తయారవుతాయని దీనివల్ల ఆఫీసు పనిభారం తగ్గి, పోలీసులు శాంతిభద్రతలపై మరింత దృష్టి పెట్టవచ్చన్నారు.









