- భార్యను చంపేందుకు బీహార్ నుంచి తుపాకీ.. హైదరాబాద్‌లో ముగ్గురు నిందితుల అరెస్ట్!
Police Bust Murder Plot | తన రెండో భార్యపై ఉన్న అనుమానంతో ఆమెను అంతమొందించేందుకు పక్కా ప్లాన్ వేసిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి కుట్రను హైదరాబాద్ పోలీసులు భగ్నం చేశారు.
చార్మినార్ టాస్క్ ఫోర్స్ మరియు అంబర్‌పేట పోలీసులు సంయుక్తంగా జరిపిన దాడిలో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి ఒక దేశవాళీ పిస్టల్, ఆరు బుల్లెట్లు, ఒక మ్యాగజైన్ మరియు ఎలక్ట్రిక్ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
అసలేం జరిగిందంటే?
మల్కాజిగిరికి చెందిన దామర అరుణ్ కుమార్ (48) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. తన రెండో భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న అరుణ్, ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తుపాకీ కావాలని తన ప్రాంతానికే చెందిన మహమ్మద్ అబ్బు (26)ను సంప్రదించాడు. అబ్బు ద్వారా యాకుత్‌పురాకు చెందిన విద్యార్థి మీర్ ముజమ్మిల్ అలీ ఖాన్ (23)తో పరిచయం ఏర్పడింది.
బీహార్ నుంచి ఆయుధాల సరఫరా:
తుపాకీ ఏర్పాటు చేస్తానని నమ్మించిన ముజమ్మిల్, అరుణ్ కుమార్ వద్ద రూ. 20,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. గత జనవరిలో ముజమ్మిల్ తన బంధువు సలామత్‌తో కలిసి బీహార్‌లోని ముంగేర్‌కు వెళ్లి, అక్కడ తాబిష్ అనే వ్యక్తి వద్ద రూ. 35,000 కు ఒక పిస్టల్, 10 బుల్లెట్లు కొనుగోలు చేశాడు.
అనంతరం హైదరాబాద్‌కు తిరిగి వచ్చి, అరుణ్ కుమార్‌కు ఆ తుపాకీని అందించి మొత్తం రూ. 1,10,000 వసూలు చేశాడు. అరుణ్ కుమార్ తన పొలంలో ఒకసారి తుపాకీని కాల్చి పరీక్షించి కూడా చూశాడు.
అలీ కేఫ్ వద్ద పట్టుబడ్డ నిందితులు:
మార్చి 9న తన భార్యను చంపే ప్రణాళికను అమలు చేసేందుకు నిందితులు ముగ్గురూ అంబర్‌పేటలోని అలీ కేఫ్ ఎక్స్ రోడ్ వద్ద సమావేశమయ్యారు. నమ్మదగిన సమాచారం అందుకున్న చార్మినార్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్. సైదాబాబు బృందం మరియు అంబర్‌పేట పోలీసులు మెరుపు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం ఈ కేసులో బీహార్‌కు చెందిన తాబిష్ మరియు సలామత్ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని అడిషనల్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండె శ్రీనివాసరావు తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న పోలీస్ బృందాన్ని అధికారులు అభినందించారు.






