Hyderabad CP Sajjanar On Chinese Manja | గాలిపటం ఎగరాల్సింది ఆకాశంలో, అమాయక ప్రాణాల్లో కాదని హితవుపలికారు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్. చైనీస్ మాంజా దారం తెగదు కానీ మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుందని గుర్తుచేశారు. క్షణికానందం మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిషేధిత చైనా మాంజా అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవని పండగని పండగలా జరుపుకోవాలని ప్రాణాలు తీసి కాదన్నారు.
మరోవైపు పోలీసులు చైనీస్ మాంజాపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ నగరవ్యాప్తంగా చైనీస్ మాంజాపై స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా కొనసాగుతోంది. జనవరి 8 నుంచి 11వ తేదీ వరకు రూ. 43 లక్షల విలువైన 2,150 బాబిన్లను హైదరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. పర్యావరణానికి, పక్షులకు, మనుషుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ నిషేధిత మాంజాను విక్రయిస్తున్న వ్యవహారంలో 29 కేసులు నమోదు చేసి 57 మందిని అరెస్ట్ చేశారు. ఇక గత నెల రోజుల్లో నమోదైన 132 కేసుల్లో రూ.1.68 కోట్ల విలువైన 8,376 బాబిన్లను స్వాధీనం చేసుకొని, మొత్తంగా 200 మందిని అరెస్ట్ చేశారు. నిషేధిత మాంజాను విక్రయించినా, కొనుగోలు చేసినా జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు సజ్జనర్.









