Nagarjuna Sagar | నాగార్జున సాగర్ వద్ద రెండో రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గురువారం తెలంగాణలో పోలింగ్ జరుగుతున్న సమయంలో సాగర్ డ్యామ్ కు చేరుకున్న ఏపీ అధికారులు 13వ గేట్ నుండి తమ పరిధిలోకి వస్తుందని చెబుతూ, సాగర్ కుడి కాలువ నుండి ఏపీకి నీటిని విడుదల చేశారు.
అలాగే ముళ్ల కంచె సైతం ఏర్పాటు చేశారు ఏపీ పోలీసులు. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే ఇప్పటివరకు సుమారు నాలుగు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకుంది ఏపీ.
దీంతో తెలంగాణ సీఎంఓ అధికారి స్మితా సబర్వాల్, నీటి పారుదల శాఖ అధికారులు నాగార్జున సాగర్ చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అలాగే కృష్ణా బోర్డ్ అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు.
ఇదిలా ఉండగా ఏపీకి చెందిన సుమారు 1200 వందల మంది పోలీసులు నాగార్జున సాగర్ వద్ద పహారా కాస్తున్నారు.
మరోవైపు అనుమతి లేకుండా డ్యామ్ పైకి వచ్చి కుడి కాల్వ నుండి నీటిని విడుదల చేసుకున్నారని, అర్ధరాత్రి సీసీ కామెరాలను ధ్వంసం చేశారని ఏపీ పోలీసులు, నీటి పారుదల శాఖ అధికారులపై నాగార్జున సాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు తెలంగాణ అధికారులు. దీంతో ఏపీ పోలీసుల, నీటి పారుదల శాఖ అధికారులపై కేసు నమోదయింది.