HCU Land Issue | రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సమీపంలో ఉన్న 400 ఎకరాల భూమిని TGIIC ద్వారా వేలం వేయడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెల్సిందే.
ఇందులో యూనివర్సిటీకి చెందిన ఒక్క ఇంచు భూమి కూడా లేదని ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో HCU రిజిస్ట్రార్ స్పందించారు. టీజీఐఐసీ ప్రకటనను ఆయన ఖండించారు. TGIIC చెప్పినట్లుగా 2024 జులైలో ఎలాంటి సర్వే జరగలేదని, భూమి ఎలా ఉందని ప్రాథమిక పరిశీలన మాత్రమే చేశారని పేర్కొన్నారు.
యూనివర్సిటీ హద్దులు అంగీకరించలేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు భూమి సరిహద్దుల్ని గుర్తించలేదని, యూనివర్సిటీకి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. 400 ఎకరాల భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని ప్రభుత్వాన్ని చాలా కాలంగా కోరుతున్నట్లు వివరించారు.