Harish Rao Fires On Cm Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆరెస్ నేత హరీష్ రావు. ఆదివారం ఖమ్మం సభలో సీఎం ప్రసంగంపై స్పందించిన హరీష్..ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ జెండా దిమ్మెలను కూల్చాలని, ఒక ముఖ్యమంత్రి బహిరంగంగా పిలుపునివ్వడం అంటే.. అది రాష్ట్రంలో శాంతిభద్రతలను ప్రత్యక్షంగా దెబ్బతీయడమే అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ దిమ్మెలు కూలగొడితే రేవంత్ దిమ్మతిరిగే లా బదులిస్తాం అని హాట్ కామెంట్స్ చేశారు. ద్రోహ బుద్ధి అనేది రేవంత్ రెడ్డి డీఎన్ఏలోనే ఉందని ఫైర్ అయ్యారు. సమైక్యవాదుల కొమ్ముకాస్తూ, స్వరాష్ట్ర కాంక్షతో పోరాడిన ఉద్యమకారుల మీద తుపాకీ ఎక్కుపెట్టిన తెలంగాణ ద్రోహి రేవంత్ అని విరుచుకుపడ్డారు.
‘ఓటుకు నోటు’ దొంగ, ప్రజాస్వామ్య ద్రోహి రేవంత్ అని అలాగే దివంగత ఎన్టీఆర్ జన్మపర్యంతం ద్వేషించిన కాంగ్రెస్ లో చేరి, నమ్మిన పార్టీకి, నాయకుడికి వెన్నుపోటు పొడిచిన టీడీపీ ద్రోహి రేవంత్ అని దుయ్యబట్టారు. సోనియా గాంధీ ఇచ్చిన సీఎం పదవిని అనుభవిస్తూ కాంగ్రెస్ సిద్ధాంతాలకు తూట్లు పొడుస్తూ కమలం చెంతన, కమలానికి కాపు కాస్తున్న బాబు చెంతన చేరడం రేవంత్ ద్రోహబుద్ధికి పరాకాష్ట అని హరీష్ నిప్పులుచెరిగారు.









