- మారుమోగిన అయ్యప్ప నామ స్మరణ
- హాజరైన స్థానిక అయ్యప్ప స్వాములు
Ayyappa Maha Padi Pooja in Harihara Kshetram | అమెరికాలోని టెక్సాస్ (Texas) రాష్ట్రం ఆస్టిన్ (Austin) నగరంలో అయ్యప్ప నామ స్మరణ మారుమోగుతోంది. నగర శివారులోని జార్జ్ టౌన్ (George Town) లో హరి హరులు కొలువైన హరిహర క్షేత్రంలో (Harihara Kshetram) హరిహర పుత్రుడి మహా పడి పూజ వైభంగా జరిగింది.
ఆస్టిన్ నగర స్థానిక కాలమానం ప్రకారం గురువారం రాత్రి 6 గంటలకు హరి హర క్షేత్రంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు సంపత్ పండిట్ నేతృత్వంలో నిర్వహించిన ఈ పడిపూజకు స్థానికంగా సమీప ప్రాంతాల నుంచి అయ్యప్ప మాల స్వీకరించిన పలువురు స్వాములు పెద్ద ఎత్తున హాజరయ్యారు.
పడిపూజలో భాగంగా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర, అయ్యప్ప పూజలు నిర్వహించారు. స్వాములు అయ్యప్ప భజన పాటలు పాడి అలరించారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజకు హాజరైన స్వాములందరికీ అల్పాహార భిక్ష అందించారు. ఈ పడిపూజలో స్వాములు హేమంత్, రామారావు, నవీన్, నరేశ్, శ్రీకాంత్, కిరణ్, వెంకటేశ్, సందీప్, ఫణీందర్, హర్ష, శ్రీను, సతీశ్, యోగేశ్, దుర్గ, చందు, అరుణ్, వంశీ తదితర ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందుకున్నారు.
బాలాలయంలో నిత్యపూజలు..
ఆస్టిన్ నగర శివారులోని జార్జ్ టౌన్ లో శైవ, వైష్ణవ క్షేత్రాలైన శివాలయం, వేంకటేశ్వర స్వామి ఆలయాలను నిర్మించనున్నారు. 375 కింగ్ రియా ప్రాంతంలో శివకేశవులతోపాటు గణపతి, అయ్యప్ప, దుర్గ, లక్ష్మీ, సరస్వతి అమ్మవార్ల ఆలయాల నిర్మాణం కూడా చేపట్టనున్నారు.
ప్రస్తుతం ఈ ఆలయంలో అన్ని పండుగలకు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇటీవలే శ్రీ పద్మావతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నిత్య పూజల్లో స్థానిక హిందూ కుటుంబాలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నాయి.