Power Cut To Petrol Pump | రోడ్డు ప్రమాదాల్లో మరణాలను నివారించడానికి యూపీ ప్రభుత్వం (UP Government) హెల్మెట్ ధరించని బైకర్లకు పెట్రోల్ పొయ్యొద్దని (No Helmet No Fuel) నిబంధన విధించింది. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హోర్డింగ్లను ఏర్పాటు చేస్తోంది.
ఈ నేపథ్యంలో హాపూర్ జిల్లాలో విద్యుత్ లైన్ మన్ పెట్రోల్ కోసం బంకు వచ్చాడు. అయితే హెల్మెట్ లేకపోవడంతో బంకు సిబ్బంది పెట్రోల్ పోయడానికి నిరాకరించారు. దాంతో అతడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.
ఆగ్రహంతో ఊగిపోతూ ఫ్యూయల్ పంపునకు పవర్ సప్లై అయ్యే స్తంభంపైకి ఎక్కి.. విద్యుత్ సరఫరాను ఆపేసి వెళ్లిపోయాడు. దీంతో షాక్ అయిన బంక్ సిబ్బంది విద్యుత్ అధికారులను ఆశ్రయించడంతో దాదాపు 20 నిమిషాల తర్వాత వారు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.
అనంతరం బంక్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైన్ మెన్ విద్యుత్ స్తంభం ఎక్కి సరఫరాను నిలిపివేసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.