Fatwa issued against Thalapathy Vijay | ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన ఆల్ ఇండియా ముస్లిం జమాత్ సంస్థ, తమిళ స్టార్ నటుడు మరియు తమిళగ వెట్రి కళగం పార్టీ అధ్యక్షుడు విజయ్‌పై ఫత్వా జారీ చేసింది.
ఈ ఫత్వాను సంస్థ జాతీయ అధ్యక్షుడు మరియు చష్మే దారుల్ ఇఫ్తా చీఫ్ ముఫ్తీ మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేలీ జారీ చేశారు. రంజాన్ నేపథ్యంలో విజయ్ ఇటీవల చెన్నైలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. అయితే మద్యం సేవించేవారు, జూదగాళ్లు, రౌడీలు ఇందులో పాల్గొన్నారని, ఇది రంజాన్ మాసం యొక్క పవిత్రతను దిగజార్చిందని రజ్వీ ఆరోపించారు.
ఈ విందులో ఉపవాసం పాటించని, ఇస్లామిక్ ఆచారాలను గౌరవించని వ్యక్తులు ఉన్నారని, ఇది ముస్లిం సమాజానికి అవమానకరమని పేర్కొన్నారు. అలాగే విజయ్ నటించిన ‘బీస్ట్’ సినిమాలో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని, ఇది ముస్లిం వ్యతిరేక ధోరణిని ప్రోత్సహిస్తుందని ఆరోపణలు చేశారు.
విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి, ముస్లిం ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు ఇఫ్తార్ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన అభిప్రాయపడ్డారు. తమిళనాడులోని సున్నీ ముస్లింలు విజయ్‌కు దూరంగా ఉండాలని, అతని కార్యక్రమాలకు హాజరు కావద్దని ఫత్వాలో రజ్వీ సూచించారు.
విజయ్‌ను మతపరమైన కార్యక్రమాలకు ఆహ్వానించవద్దని, అతని రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వవద్దని కోరారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని తమిళనాడు ముస్లింలకు సూచించారు.