Wednesday 28th May 2025
12:07:03 PM
Home > తాజా > ‘నాడు ఫ్రీ అని నేడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గం’

‘నాడు ఫ్రీ అని నేడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గం’

harish and revanth
  • ఎల్ ఆర్ ఎస్ స్కీం ఉచితంగా అమలు చేయాలి
  • అధికారులకు టార్గెట్లు పెడుతూ ప్రజలను వేధింపులకు గురిచేయడం దారుణం
  • ప్రజలు ఎల్ఆర్ఎస్ ఒక్క రూపాయి కట్టొద్దు
  • ప్రభుత్వ మెడలు వంచి ఎల్ఆర్ఎస్ ఉచితంగా అమలు చేయించే బాధ్యత బిఆర్ఎస్ ది
  • సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ

హైదరాబాద్: (Harish Rao Letter To CM Revanth) రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం, ఎల్ఆర్ఎస్ (LRS) (భూముల క్రమబద్దీకరణ) పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు.

హరీశ్ రావు లేఖ యధాతథంగా.. (Harish Rao Letter To CM Revanth Reddy)

గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి..

రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం, ఎల్ఆర్ఎస్ (భూముల క్రమబద్దీకరణ) పథకాన్ని పూర్తి ఉచితంగా అమలు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను.

ఒకవైపు రుణమాఫీ కాక, రైతు బంధు రాక రైతన్నలు ఆవేదన చెందుతుంటే, మరోవైపు విషజ్వరాలతో సామాన్య ప్రజలు ఆసుపత్రుల పాలై, ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారు.

ఇలాంటి ప్రధానమైన సమస్యలను పరిష్కరించి ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన మీ ప్రభుత్వం, ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని కలెక్టర్ స్థాయి నుంచి పంచాయతీ సెక్రెటరీ వరకు ఉన్న యంత్రాంగం మీద తీవ్ర ఒత్తిడి చేస్తున్నది. పంచాయతీ సెక్రెటరీలు, బిల్ కలెక్టర్లు రోజుకు మూడు నాలుగు సార్లు ఫోన్లు చేస్తూ ప్రజలను వేధిస్తున్నారు.

ఫీజులు చెల్లించకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారు. డిమాండ్ నోటీసులు ఇస్తూ టార్గెట్లు పెట్టి మరీ మొత్తం 15వేల కోట్లు వసూళ్లు చేయాలని ఆదేశాలివ్వడమంటే ప్రజల రక్తమాంసాలను పీల్చడమే. మీ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న మీరు.. ఈ రోజు ప్రజలనెందుకు దోపిడీ చేస్తున్నారో సమాధానం చెప్పాలి. నాడు ఫ్రీఫ్రీఫ్రీ అని, నేడు ఫీజు ఫీజు ఫీజు అంటున్నారు. ప్రజలు దాచుకున్న సొమ్మును నిలువునా దోచుకునే కుట్ర చేస్తున్నారు.

ఓడ దాటే దాక ఓడ మల్లన్న, ఓడ దాటినంక బోడి మల్లన్న చందంగా ఉన్నమీ వైఖరి మరోసారి తేటతెల్లమవుతున్నది. అపుడు ఎల్ ఆర్ ఎస్ కు ఫీజు వద్దన్న మీరు ఇప్పుడు అధికారం లోకి రాగానే అదే ఎల్ ఆర్ ఎస్ తో దందా చేస్తున్నారా? అప్పుడు కట్టొద్దని ఇప్పుడు కాటు వేస్తారా ?

స్వయంగా మీతో సహా ప్రస్తుతం మీ కేబినెట్‌లో సహచరులుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఉత్తంకుమార్ రెడ్డి, సీతక్క, కోమటిరెడ్డి వంటి నేతల మాటలను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.

1, ఉత్తమ్ కుమార్ రెడ్డి: నో ఎల్ఆర్ఎస్- నో బీఆర్ఎస్, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్‌ను అమలు చేస్తాం.

2, భట్టి విక్రమార్క: రక్తాన్ని పీల్చాలన్న ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీలైతే కట్టమాకండి. అప్పుల భారాన్ని ఎల్ఆర్ఎస్ రూపంలో ప్రజల మీద వేస్తున్నారు.

3, సీతక్క: ఎల్ఆర్ఎస్ పేరుతో దోచుకోవడానికి, దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లిగవ్వ లేకుండా చేయడానికి కొత్త నాటకం.

4, రేవంత్ రెడ్డి: బిఆర్ఎస్ అయిపోయింది. ఎల్ఆర్ఎస్ అయిపోయింది. ఎంఆర్ఎస్ తెస్తడట. ఎంఆర్ఎస్ అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీం కూడా తీసుకొస్తుందేమో.

ఇవి మాత్రమే కాదు, ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలి అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఏకంగా హైకోర్టుకు వెళ్లారు. పిల్ దాఖలు చేసారు.

ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్య పెట్టి రెచ్చగొట్టేలా బహిరంగ సభల్లో ఊదరగొట్టిన మీరు, మీ మంత్రులు.. ఎన్నికలు పూర్తికాగానే మాట మార్చి ఎల్ఆర్ఎస్ పైన ఫీజులు వసూలు చేయాలని నిర్ణయం తీసుకోవడం మీ రెండు నాల్కల ధోరణికి అద్దం పడుతున్నది.

రాష్ట్రంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల పైన రూ.15వేల కోట్ల మేర ఎల్ఆర్ఎస్ చార్జీల భారం వేయడం పరిపాలనలో, హామీల అమలులో మీ డోల్లతనానికి నిదర్శనంగా నిలుస్తున్నది.

మాది ప్రజాపాలన అని డబ్బాకొట్టుకుంటున్న మీకు 25.44 లక్షల దరఖాస్తుదారుల కుటుంబాల ఆవేదన కనిపించడం లేదా?

ఇప్పటికైనా కళ్లు తెరిచి మీరు ఇచ్చిన హామీ ప్రకారం, పూర్తి ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.

మాట తప్పిన ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఏ ఒక్కరూ ఒక్క రూపాయి ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించవద్దని రాష్ట్ర ప్రజలకు పిలుపునిస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయించే బాధ్యత బిఆర్ఎస్ తీసుకుంటుందని స్పష్టం చేస్తున్నాం.

-తన్నీరు హరీశ్ రావు సిద్దిపేట శాసనసభ్యులు

You may also like
cm revanth reddy
‘ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం గిరిజనులకు వరం’
cm revanth reddy
ఆ విషయంలో తెలంగాణ దేశానికే ఆదర్శం: సీఎం రేవంత్!
tg ssc results
పదో తరగతి ఫలితాల్లో ఈ జిల్లా టాప్!
cm revanth reddy
కేసీఆర్ ప్రసంగంపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏమన్నారంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions