Harish Rao Slams Congress Govt | తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రజా సమస్యలపై చర్చ లేకుండా, కేవలం తూతూమంత్రంగా ముగిశాయని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు.
మంగళవారం అసెంబ్లీ మీడియా హాల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని, ప్రజల దృష్టిని మరల్చడానికే ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు.
19 అంశాలపై చర్చకు నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం ముందుకు రాలేదని, కేరళ ఎన్నికల ప్రచారం కోసం సభను అర్థాంతరంగా ముగించారని విమర్శించారు. కృష్ణా, గోదావరి జలాలపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అవినీతిని సాక్ష్యాధారాలతో బయటపెట్టినందుకే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి ముఖ్యమైన బిల్లులను ఏకపక్షంగా ఆమోదింపజేసుకున్నారని ధ్వజమెత్తారు.
అసెంబ్లీని గాంధీభవన్‌లా మార్చేశారని, సీఎం మరియు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాడిన ‘పైల్వాన్ల భాష’ను ఎథిక్స్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు.
ఆరు గ్యారెంటీలు ఏవి..
“మూడు బడ్జెట్లు ముగిసినా మహిళలకు రూ. 2500 ఊసేలేదు. ప్రజల చెవిలో పువ్వులు పెట్టినందుకే మేము నిరసనగా చెవిలో పూలు పెట్టుకున్నాం” అని ఎద్దేవా చేశారు.
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కాళేశ్వరంపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, ఇది బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఉన్న ‘ఫెవికాల్ బంధానికి’ నిదర్శనమని హరీశ్ రావు పేర్కొన్నారు.
“కాళేశ్వరం కొట్టుకుపోతే.. మల్లన్న సాగర్‌లో 25 టీఎంసీల నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? నిన్నటి బడ్జెట్‌లో కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన లెక్కలు అబద్ధమా?” అని ప్రశ్నించారు.
“బీజేపీ, కాంగ్రెస్ నేతలు దమ్ముంటే మాతో రండి. గలగలా పారుతున్న గోదావరి నీళ్లను, కాళేశ్వరంతో పండుతున్న పచ్చని పొలాలను చూపిస్తాం” అని సవాల్ విసిరారు.
కేవలం రూ. 50 కోట్లు ఇస్తే రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు వస్తాయని, కానీ కాళేశ్వరంపై తాము చెప్పిన అబద్ధాలు బయటపడతాయనే భయంతో ప్రభుత్వం నిధులు ఆపేసి రైతుల పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అసెంబ్లీలోనే కాకుండా, ప్రజాక్షేత్రంలోనూ పోరాటం కొనసాగిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.






