Election Commission is compromised: Rahul Gandhi in U.S. | కాంగ్రెస్ అగ్ర నాయకులు, లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘంపై సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది.
రాహుల్ గాంధీ గత కొంతకాలంగా ఎన్నికల సంఘం యొక్క పనితీరుపై విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెల్సిందే. ఏప్రిల్ 20న అమెరికా బోస్టన్‌లో జరిగిన సమావేశంలో ప్రవాస భారతీయుల్ని ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. ఎన్నికల సంఘం “రాజీపడింది” అని ఆరోపించారు.
మహారాష్ట్రలో 2024 లోక్‌సభ ఎన్నికలు మరియు అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం ఐదు నెలల వ్యవధిలో 39 లక్షల కొత్త ఓటర్లు జాబితాలో చేరారని రాహుల్ పేర్కొన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో ఓటర్లు చేరడం అసాధ్యమని, ఇది ఓటరు జాబితా మార్పులో అవకతవకల మూలంగానే జరిగిందన్నారు.
మహారాష్ట్రలో ఓటు వేయడానికి అర్హత ఉన్న జనాభా 9.54 కోట్లు కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో 9.7 కోట్ల మంది ఓటు వేశారని, ఇది సాధ్యం కాదని వెల్లడించారు. అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో సాయంత్రం 5:30 నుండి 7:30 వరకు కేవలం రెండు గంటల వ్యవధిలో 65 లక్షల మంది ఓటర్లు ఓటు వేశారని ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఒక ఓటరు ఓటు వేయడానికి సగటున 3 నిమిషాలు పడుతుందని, ఈ గణాంకాల ప్రకారం రాత్రి 2 గంటల వరకు ఓటర్ల బారులు ఉండాల్సి ఉంటుందని, కానీ అలాంటిది జరగలేదని ఆయన పేర్కొన్నారు.
ఓటింగ్ ప్రక్రియ యొక్క వీడియో రికార్డింగ్‌ను అందించాలని కాంగ్రెస్ కోరినప్పటికీ, ఎన్నికల సంఘం తిరస్కరించడమే కాకుండా, ఇకపై వీడియో రికార్డింగ్‌ను అడగకుండా చట్టాన్ని సవరించిందని రాహుల్ ఆరోపించారు. “ఎన్నికల సంఘం రాజీపడింది, వ్యవస్థలో ఏదో లోపం ఉంది” అని రాహుల్ స్పష్టంగా పేర్కొన్నారు.