Trump Warns Iran | ప్రపంచ దేశాలను వణికించేలా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ దేశంపై సంచలన ప్రకటన చేశారు. బుధవారం రాత్రి వైట్ హౌస్ నుండి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, ఇరాన్‌పై జరుగుతున్న ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’ (Operation Epic Fury) కీలక దశకు చేరుకుందని వెల్లడించారు.
రానున్న రెండు నుండి మూడు వారాల్లో ఇరాన్ తన మొండివైఖరి వీడి ఒప్పందానికి రాకపోతే, ఆ దేశాన్ని బాంబులతో కుప్పకూల్చి ‘రాతి యుగం’ (Stone Age) లోకి పంపడం ఖాయమని అత్యంత కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.
‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’తో విధ్వంసం..
గత 32 రోజులుగా సాగుతున్న ఈ సైనిక చర్యలో అమెరికా అద్భుతమైన విజయాలు సాధించిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ నావికాదళం (Navy) పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, వారి ఎయిర్ ఫోర్స్ మరియు క్షిపణి వ్యవస్థలు అస్తవ్యస్తమయ్యాయని వివరించారు.
“ఇరాన్ ఇక ఎంతమాత్రం ముప్పు కాదు. ఆ దేశ అగ్ర నాయకత్వం ఇప్పటికే హతమైంది. మేము ఇంకా వారి చమురు నిలయాలపై దాడి చేయలేదు, ఎందుకంటే వారికి కోలుకునే చిన్న అవకాశం ఇవ్వాలని ఆగాము. కానీ వారు వినకపోతే, ప్రతి ఎలక్ట్రిక్ ప్లాంట్‌ను, చమురు బావులను ధ్వంసం చేస్తాం” అని ట్రంప్ హెచ్చరించారు.
రెండు వారాల గడువు..
ఇరాన్‌లోని ప్రస్తుత కొత్త యంత్రాంగం కొంత ‘రీజనబుల్’గా ఉన్నట్లు కనిపిస్తోందని, అయితే అణ్వాయుధాల తయారీని పూర్తిగా నిలిపివేయాలని ట్రంప్ డిమాండ్ చేశారు.
“మేము అతి త్వరలోనే ఇరాన్ నుండి నిష్క్రమించాలనుకుంటున్నాం. అది రెండు వారాల్లో జరగవచ్చు లేదా మూడు వారాల్లో జరగవచ్చు. కానీ అది జరగాలంటే ఇరాన్ మా షరతులకు లొంగి తీరాలి. లేదంటే గతంలో ఎన్నడూ చూడని రీతిలో అత్యంత భయంకరమైన దాడులను ఇరాన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రపంచ మార్కెట్లపై ప్రభావం..
ట్రంప్ చేసిన ఈ ప్రకటనతో అంతర్జాతీయ చమురు ధరలు ఒక్కసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ ఇప్పటికే హార్ముజ్ జలసంధిని (Strait of Hormuz) మూసివేసినట్లు సమాచారం అందుతోంది.
దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా స్పందిస్తూ.. ఇరాన్ అహంకారం వల్ల ఆ దేశం కొన్ని దశాబ్దాల వెనక్కి వెళ్లిపోయిందని వ్యాఖ్యానించారు.






