Friday 18th October 2024
12:07:03 PM
Home > తెలంగాణ > తెలంగాణ ఊర్లల్ల అసలైన దసరా సంబురం ఇదే.. ఓ ఎన్నారై యాది!

తెలంగాణ ఊర్లల్ల అసలైన దసరా సంబురం ఇదే.. ఓ ఎన్నారై యాది!

యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం శివారెడ్డిగూడెంలో చిన్నప్పటి దసరా పండగ తీపి జ్ఞాపకాలు

ఆ తీపి జ్ఞాపకాలు మరొక్కసారి గుర్తు చేసుకుంటూ….

అప్పట్లో దసరాకు మాకు పదిహేను రోజులు ఇస్కూలుకి తాతిలు(సెలవులు) ఇచ్చేటోళ్లు. మనకు ఉన్న పెద్ద పండుగ దసరా పండుగ. ఎంగిలి పువ్వుల బతుకమ్మ నుంచి మొదలు పెట్టి సద్దుల బతుకమ్మ దాకా తొమ్మది రోజులు బతుకమ్మ సందడి ఆ తర్వాత దసరా పండుగ సందడి.

బతుకమ్మ పూలు తేవడానికి కోడి కూయంగనే లేచేటోల్లం… ఇస్తారోళ్ల జంగారెడ్డి మామ , కొండలు మామ, మేకలోళ్ల శ్రీను గాడు , కురోంబాయి సత్తి రెడ్డి గాడు, కృష్ణా రెడ్డి, కొండలు గాడు అందరం కలిసి , రాంలింగంపల్లి బురుజు కాడికెళ్ళి మొదలు పెట్టి, తెల్ల పలుగు, మెట్టవర్లబాయి , దుఖానం కుంట, మోరొల్లబాయి అంత తిరిగేటోళ్ళం. గునుగు పువ్వు, ముత్యాల పువ్వు ,తంగేడి పువ్వు, బంతి పువ్వు , చామంతి పువ్వు , గన్నేరు పువ్వు ఇలా రకరకాల పువ్వులు తెచ్చేటోల్లం. బతుకమ్మ పేర్చుడుల పోటీ ఉండేది మన ఊళ్లే . మా పాత ఆడకట్టుకి బాపన్ సుశీలవ్వ(అమ్మమ్మ) మన ఊరిలో అందరికంటే పెద్ద బతుకమ్మ పేర్చేది. మన ఊరి మొత్తంలో మా ఆడకట్టుకే పెద్ద బతుకమ్మ ఉండేది ఎప్పుడైనా. ఇప్పుడు కూడా మన ఊరిలో అందరికంటే పెద్ద బతుకమ్మ బాపను సుశీలవ్వదే అంట . జెండకాడి నర్సిరెడ్డి తాత వాకిట్లో మా ఆడకట్టు వాళ్ళు బతుకమ్మ ఆడేవారు. ఇగ బింగి సత్తెమ్మ బతుకమ్మ పాట అందుకుందంటే ఇగ ఓడుస్తదా, ఆగ ఒడుస్తదా పాట. నాలుగైదు గంటలు ఆపకుంట ఆడేటోళ్లు. మా పోరగాళ్లం అయితే తుపాకీలల్ల రీళ్లు నింపి దొంగ పోలీస్ ఆటలు ఆడేటోల్లం . ఊరంతా కలేతిరిగేటోల్లం బతుకమ్మళ్లను చూస్తందుకు. కొందరు పోరీలు అయితే ఏతులు కొట్టేటోళ్లు బతుకమ్మ ఆడమంటే , ఏమి రోగం పుట్టింది పోరి బతుకమ్మ ఆడుతలేవు అని తిట్టేటోల్లం 😊😃 రాత్రి పది దాటినంక బతుకమ్మలను నిమజ్జనం చేసేటోళ్లం పెద్ద కాల్వకాడ. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు నీళ్లు చళ్ళు కుంటోల్లం, మలిద ముద్దలు పంచేటోల్లం అందరికి . బతుకమ్మ గురించి ఎంత చెప్పిన ఒడువదు. ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు.

మాకు కొత్త బట్టలు కుట్టియ్యకుంటే అది దసరా పండగనే కాదు . మేరోళ్ల(టైలరు) దగ్గర కుట్టించుకునేటోల్లం బట్టలు. మేర కృష్ణమూర్తి తాత , మేర రాములు తాత, ఆ తర్వాత కాల్వమీది సుధాకర్ మామ , కురొంబాయి కిష్టారెడ్డి మామ , గరుదాస్/అంతటి బాలయ్య ఇలా ఎందరో టైలర్లు ఉండేది మన ఊళ్ళో, దసరా అప్పుడు అయితే ఫుల్ గిరాకీ ఒక్కొక్కరికి. తర్వాత తర్వాత రెడీమేడ్ బట్టలు కొనుడు షురూ జేసినము. దసరా రోజు పాలపిట్టను చూస్తే పుణ్యం అని చెప్పేటోళ్లు మన తాతలు . పొద్దున లేవంగానే బాయికాడికి పోయి స్నానం చేసి , ఇగ పాలపిట్టెని చూద్దామని అన్ని చెల్కలు తిరిగేటోల్లము. అదృష్టం బాగుంటే కనిపించేవి.
చిచ్చుబుడ్లు, లక్ష్మి బాంబులు, తోక పటాకులు, లాడి, రాకెట్లు , సురసుర బాణాలు , పిస్తోళ్లు , సుతిలుబాంబులు ఇలా ఎన్నో రకాల టపాకులు కొనేవాళ్ళం. పొద్దటి నుండి సాయంత్రం దాకా ఒకటే బాంబుల మోత. చేతిలో బాంబు పట్టుకొని కూడా కాల్చేటోల్లం, ఆ ధైర్య సాహసాలు వేరు . గిండ్రి యాదగిరి తాతోళ్ళ బాయి దగ్గర జమ్మి చెట్టు పెట్టేటోళ్లు. సాయంత్రం కాగానే అందరం జమ్మి చెట్టు కాడికి పోయేటోల్లం. ఇందిరాల నుండి బాపను పంతులు వచ్చి జమ్మి చెట్టుకు పూజ చేసేటోడు. ఆ తర్వాత మేము “శమీ శమీ యతే పాపం, శమీ శత్రు వినాశనం,
అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శనం” అనే శ్లోకాన్ని పేపర్ మీద రాసి జమ్మి చెట్టు మీద పెట్టెటోళ్లము. ఆ తర్వాత జమ్మి ఆకు తెంపి ఒకరికొకరం పంచుకొని అలయ్ బలయ్ తీసుకుంటోల్లం. ఆ రోజు రాత్రికి కొంటు పుల్లయ్య తాత(ఆంజినేయ స్వామి గుడి కాడ) ఇంటి దగ్గర అందరము జమ అయ్యి ఆటలు ఆడేవాళ్ళం. ఆడోల్లు బతుకమ్మ ఆడేవాళ్లు, మగవాళ్లేమో చుట్టూ తిరుగుకుంటూ భజన పాటలు పాడేటోళ్లు . కాల్వమీది రాంచెంద్రి తాత భజన పాట చెప్పేటోడు, నాకు గుర్తున్న కొన్ని పాటలు
1 . “కోతులు పుట్టేదేందుకు కొమ్మలు విరిసేటందుకు, కొమ్మలు విరిసేదేందుకు రథముకు కట్టేటందుకు”

  1. “రామం భజే రామం భజే మన రాముడొస్తున్నాడు రామం భజే , ఊరు ఊరు తిరిగి రామం భజే మన ఊరికొస్తున్నాడు రామం భజే”

ఇలాంటి హుషారెత్తే పాటలతో రాత్రి సరదాగా గడిపేవాల్లం. ఆ తర్వాత ఇంటిఇంటికి తిరిగి జమ్మి ఆకు పంచేటోల్లం. ఎంతైనా ఆ రోజులే వేరప్పా..

మీ శ్రేయోభిలాషి,
ప్రభోద్ రెడ్డి మేకల

You may also like
harish rao
హస్తం తీసేసి ఆ గుర్తు పెట్టుకోండి.. కాంగ్రెస్ పై హరీశ్ రావు హాట్ కామెంట్స్!
Amrapali reddy kata
నగరంలో వాటిపై నిషేధం.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంచలన ఆదేశాలు!
cm revanth reddy
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్!
chess
చెస్ లో గోల్డ్ మెడల్ సాధించిన ఆటగాళ్లకు సీఎం అభినందనలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions