Cyber Crime News | సైబర్ నేరం అనేది ఒక అంతర్జాతీయ పరిశ్రమగా మారిపోయిందని, దీని వెనుక కొన్ని దేశాలు ఉన్నాయని పేర్కొన్నారు మాజీ ఐపీఎస్ అధికారి, బీఆరెస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గతంలో దారి దోపిడీలు, దొంగతనాలు, హత్యలు బాగా జరిగేవని, వీటిని పోలీసులు సునాయాసంగా అరికట్టేవారని, కానీ 21వ శతాబ్దంలో సైబర్ నేరాలు వీటన్నిటినీ మించిపోయాయని చెప్పారు. సైబర్ నేరం అనేది హింస లేని నేరం అని పేర్కొన్నారు. నేరస్థుడిని ఎప్పుడూ శారీరకంగా కలవలేరు, పోలీసులకు బాధితులు కోల్పోయిన డబ్బు అంతా తిరిగి తీసుకురావడం అత్యంత కష్టంతో కూడుకున్న పని అని తెలిపారు.
సైబర్ నేరం ఒక అంతర్జాతీయ పరిశ్రమగా మారిపోయిందని దీని వెనుక కొన్ని దేశాలు ఉన్నాయన్నారు. సంపద డిజిటలైజ్ అయిపోయిన నేటి రోజుల్లో — ఇంటికి ఎంత పెద్ద తాళాలు వేసుకున్నా, ఎంత మంది సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేసుకున్నా మనం రోజూ వాడే సెల్‌ఫోన్లు, కంప్యూటర్లకు పాస్‌వర్డ్ ఫీచర్లను తరచూ వాడకపోతే… మన సంపదను అంతర్జాతీయ నేరస్థుల చేతిలో అప్పగించినట్లే అని అప్రమత్తం చేశారు. ఆర్థిక నేరాలకు అన్నింటికీ మూలం ‘తక్కువ కాలంలో చాలా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకోవడం’ అనేదే అని అన్నారు.
అలా అనుకోవడం తప్పు కాదు, కానీ అది అసాధ్యమన్నది చాలా మందికి తెలియదని ఇలాంటి మార్గాల్లో కోటికి ఒకరు మాత్రమే లాభపడతారన్నారు. కానీ వాళ్లను చూసి అందరూ ‘రహస్యంగా’ అలాగే అవ్వాలనుకుంటారు సరిగ్గా ఇక్కడే సైబర్ నేరగాళ్లు ఎంటర్ అవుతారని ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. స్వార్ధం, లోభం, అమాయకత్వంతో ప్రజలు జీవితకాలం కష్టపడి సంపాదించిన డబ్బులను క్షణాల్లోనే పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.









