Congress MLA cuts power to official’s houses in Uttarakhand | ఉత్తరాఖండ్ లో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కరెంట్ కోతలపై గత 15 రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన సదరు ఎమ్మెల్యే అధికారుల ఇళ్లకు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. స్వయంగా ఎమ్మెల్యేనే విద్యుత్ స్థంబాలు ఎక్కి, తీగలు కట్ చేశారు. హరిద్వార్ జిల్లా ఝబ్రెడా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర జాటి (Virendra Jati), తన నియోజకవర్గంలో రోజూ 5-8 గంటలు విద్యుత్ కోతలు జరుగుతుండడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉదయం 5 నుంచి 8 గంటల మధ్య రోస్టరింగ్ విధించడం వల్ల పిల్లలు స్కూలుకు వెళ్లడం, పశువులకు నీళ్లు పోయడం, ఇతర ఇంటి పనులకు అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
గత 10-15 రోజులుగా విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, తాజగా రూర్కీలోని విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ వివేక్ రాజ్‌పుత్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వినోద్ పాండే, చీఫ్ ఇంజినీర్ అనుపమ్ సింగ్‌ల అధికారిక నివాసాల వద్దకు మద్దతుదారులతో కలిసి వెళ్లారు. నిచ్చెన, కట్టింగ్ టూల్స్‌తో వచ్చిన ఆయన స్వయంగా విద్యుత్ స్తంభాలు ఎక్కి ముగ్గురు అధికారుల ఇళ్లకు వెళ్లే తీగలను కట్ చేశారు. “అధికారులు ఒక గంట కరెంటు లేకుండా ఇబ్బంది పడితే, ప్రజలు రోజూ గంటల తరబడి ఎలా భరిస్తారు? సమస్య పరిష్కారం కాకపోతే అన్ని ప్రభుత్వ అధికారుల ఇళ్ల కరెంటు కట్ చేస్తాం” అని ఆయన హెచ్చరించారు. మరోవైపు “శీతాకాలంలో విద్యుత్ కొరత వల్ల ఉదయం రోస్టరింగ్ అనివార్యం” అని అధికారులు చెప్పారు. అయితే విద్యుత్ శాఖ అధికారులు ఎమ్మెల్యే చర్యను ఖండిస్తూ, తీగలు కట్ చేయడం ప్రమాదకరమని, పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆరోపిస్తూ రూర్కీ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.









