Cm Stalin About Hindi | ఉత్తర ప్రదేశ్, బీహార్ వంటివి హిందీ రాష్ట్రాలు కాదని వాటి స్థానిక భాషలు కాలగర్భంలో కలిసిపోయాయని పేర్కొన్నారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.
కాగా జాతీయ విద్యావిధానంలో త్రిభాషా సూత్రంలో భాగంగా ఇంగ్లీష్, హిందీ మరియు ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్రం పేర్కొంది. కానీ మరోవైపు తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని, హిందీని తమపై రుద్ద వద్దని స్టాలిన్ స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో గత కొన్నిరోజులుగా హిందీ భాషపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది.
ఈ నేపథ్యంలో తాజగా స్టాలిన్ గురువారం ఎక్స్ ( X ) వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాల సోదర, సోదరీమణులారా హిందీ ఎన్ని భారతీయ భాషలను మింగేసిందో ఎప్పుడైనా ఆలోచించారా? అంటూ ప్రశ్నించిన స్టాలిన్ భోజ్‌పురి, మైథిలి, అవధి, బ్రజ్ ఇలా 25కు పైగా ఉత్తర భారత స్థానిక భాషలు హిందీ మూలంగా ఇప్పుడు మనుగడ కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు.
హిందీ గుర్తింపు కోసం తీసుకువస్తున్న ఒత్తిడి ప్రాచీన మాతృభాషలను చంపుతుందన్నారు. యూపీ మరియు బీహార్ ఎప్పుడూ రాష్ట్రాలు కాదు వాటి నిజమైన భాషలు గతంలో కలిసిపోయాయని చెప్పారు. తమిళనాడుకు కూడా అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతోనే ప్రతిఘటిస్తున్నట్లు స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.









