CM Revanth Reddy Speeh Today | ప్రజా పాలన రావాలని, ప్రజల జీవితాల్లో మార్పు రావాలనే బలమైన ఆకాంక్షతోనే 2023 ఎన్నికల్లో ప్రజలు కష్టపడి ఈ ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని శిల్పా కళా వేదికలో మాదిగ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
2023 ఎన్నికల సమయంలో తమ వద్ద అధికార యంత్రాంగం గానీ, అక్రమ సంపాదన గానీ లేదని ఆయన తెలిపారు. ఒక వైపు అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యం చెలాయిస్తున్న వారు ఉండగా, మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎన్నికల్లో గెలవాలనే చిత్తశుద్ధితో తాము పోరాటం చేశామని చెప్పారు. మాటలు, మూటలతో అయితే తాము ఎన్నికల్లో గెలిచేవాళ్లం కాదని స్పష్టం చేశారు.
ఎస్సీ వర్గీకరణ అంశం చాలా కాలంగా కొనసాగుతున్న సమస్య అని సీఎం గుర్తుచేశారు. ఈ పోరాటంలో కొందరు ప్రాణత్యాగాలు కూడా చేశారని పేర్కొన్నారు. గత 20 ఏళ్లుగా ఈ సమస్యను తాను దగ్గరగా గమనిస్తున్నానని, మాదిగ వర్గం చేసిన ప్రతి ఉద్యమంలో తన వంతు సహాయం అందించానని తెలిపారు.
కృష్ణ మాదిగ, సతీష్ మాదిగ తనను కలిసిన సందర్భాల్లో వారికి అండగా నిలిచానని చెప్పారు. అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో అప్పటి పాలకులు సండ్ర వెంకటవీరయ్య, సంపత్ కుమార్‌లతో పాటు తనను సభ నుంచి బయటకు పంపిన ఘటనను కూడా ఆయన గుర్తుచేశారు.
మహాభారతంలోని కర్ణుడు, బర్బరీకుడు పాత్రలు తనకు ఎంతో ఇష్టమని సీఎం పేర్కొన్నారు. కర్ణుడు అవమానానికి గురైనప్పుడు పోరాటం చేసినట్లే, బర్బరీకుడు బలహీనుల పక్షాన నిలిచినట్లే తాను కూడా బలహీన వర్గాల పక్షాన నిలిచానని తెలిపారు. రాజకీయ ఒత్తిడులు వచ్చినప్పటికీ మాదిగల పక్షాన నిలబడినట్లు వెల్లడించారు.
“సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత వర్గీకరణ అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ”
సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రక్రియలో తనతో పాటు మంత్రి వర్గ సహచరులు, అధికారులు సమయస్ఫూర్తితో సహకరించారని ఆయన పేర్కొన్నారు.
వర్గీకరణ అన్ని సమస్యలకు పూర్తి పరిష్కారం కాకపోవచ్చని ఆయన అన్నారు. అయితే ప్రమోషన్లు, ఉన్నత విద్య, భూములు, లిడ్ క్యాప్ భూముల రక్షణ వంటి అంశాలను పరిష్కరించడం పెద్ద విషయం కాదని చెప్పారు.
ప్రభుత్వం ముందుండి సమస్యలను పరిష్కరిస్తున్న సమయంలో వెనుక నుంచి జరిగే దాడులను ప్రజలే అడ్డుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. అలాంటి సందర్భాల్లో తమకు మద్దతుగా నిలవాలని మాదిగ సమాజాన్ని కోరారు. నిరంతరం అప్రమత్తంగా ఉండి సమస్యలను అర్థం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు.
ప్రభుత్వానికి కళ్లు, చెవులు, బ్రాండ్ అంబాసిడర్లు ప్రభుత్వ ఉద్యోగులేనని సీఎం అన్నారు. 99 రోజుల ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.
ప్రతి పేదవాడికి రేషన్ కార్డు అందాలంటే ప్రభుత్వ ఉద్యోగులు కష్టపడి పనిచేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాల కోసం పేదలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. అత్యంత వెనుకబాటుతనంలో ఉన్న మాదిగ సమాజానికి ప్రభుత్వ ఉద్యోగులు అండగా నిలవాలని ఆయన కోరారు.
“చెప్పులు కుట్టే జాతి కాదు… కలెక్టర్లు, డాక్టర్లు కావాలి”
సమాజంలో వెనుకబడిన వర్గాలు విద్య ద్వారా ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి నెల సుమారు వెయ్యి మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అవుతున్నారని, వారికి నెలకు వెయ్యి కోట్ల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తోందని తెలిపారు. అయినప్పటికీ ప్రభుత్వం సమన్వయంతో ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదేనని ఆయన పేర్కొన్నారు. అక్రమాలను అరికట్టి ఖజానాకు నిధులు తీసుకువస్తే పది మందికి సాయం చేయగలమని చెప్పారు.
గతంలో జాగీర్దారులు, జమీందార్ల వద్ద వేలాది ఎకరాల భూములు ఉండేవని, అసైన్డ్ భూముల విషయంలో ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రస్తుతం ప్రభుత్వానికి పంచడానికి భూములు పరిమితంగా ఉన్నాయని, ఆర్థిక వనరులు కూడా పరిమితంగానే ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. దారిద్ర్య రేఖలో ఉన్న సమాజాలు ముందుకు రావాలంటే విద్యే ప్రధాన మార్గమని చెప్పారు.
విద్యా శాఖలో సంస్కరణలు చేపడుతున్నామని, నాణ్యమైన విద్య అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు కాస్మోటిక్, డైట్ ఛార్జీలను పెంచామని చెప్పారు.
గత ప్రభుత్వాలు బర్రెలు, గొర్రెలు, చేపలు ఇచ్చి జీవనోపాధి చూపించాయని, కానీ చెప్పులు కుట్టే జాతి ఈ రాజ్యాన్ని నడపాలని తాను కోరుకుంటున్నానని సీఎం అన్నారు. ఆ సమాజాల నుంచి కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు రావాలని ఆకాంక్షించారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన సీఎం, తన శక్తి ఉన్నంతవరకు వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తానని తెలిపారు.
సీఎంగా వచ్చిన అవకాశాన్ని పది మందికి సాయం చేయడానికే వినియోగిస్తున్నానని చెప్పారు. తమ హక్కులను చట్టబద్ధంగా కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని ఆయన స్పష్టం చేశారు.










