Cm Revanth Reddy News | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 2 నుంచి జూన్ 9 వరకు రాష్ట్రంలో వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై 100 రోజుల కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణా రావు ప్రకటించారు. సచివాలయంలో గురువారం ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించిన సీఎస్ ముఖ్యమంత్రితోపాటు రాష్ట్ర మంత్రులు ప్రజా ప్రతినిధులు పాల్గొనే ఈ వంద రోజుల కార్యక్రమంలో అన్ని శాఖల వారీగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
వంద రోజుల కార్యక్రమంపై ఈ నెల 28వ తేదీన నిర్వహించే కార్యదర్శుల సమావేశానికి సీఎం హాజరవుతారని తెలిపారు. మార్చి 1వ తేదీన జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మార్చి 2వ తేదీ నుంచి జూన్ 9 వ తేదీ వరకు వివిధ అభివృద్ధి పనులపై ప్రతీ శాఖ తమ 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.






