New Scheme For TG Women | రాఖీ పండుగ (Raksha Bandhan 2025) సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ శుభవార్త చెప్పారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారత కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలో సోలార్ విద్యుత్ ప్లాంట్ల (Solar Power Plants) ఏర్పాటు కోసం మహిళా సంఘాలకు నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన, సాధికారతను ప్రోత్సహించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో 1,000 మెగావాట్లు విద్యుత్ ను మహిళా సంఘాల ద్వారా ఉత్పత్తి చేయించాలని భావిస్తోంది. అందుకే ఈ నిర్ణయం తీసుకంది. ఒక్కో మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దాదాపు రూ.3 కోట్ల ఖర్చు అవుతుంది.
ఈ ఖర్చులో 10 శాతం డబ్బును మహిళా సంఘాలు పెట్టుబడిగా పెట్టాలి. మిగిలిన 90 శాతం డబ్బును బ్యాంకుల ద్వారా రుణంగా ఇస్తారు. సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను సంస్థలకు విక్రయించి ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ కింద సంవత్సరానికి గాను రూ.30 లక్షల లాభాలు పొందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు.









