CM Revanth Reddy About Medaram Jathara | మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).
ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం మహాజాతరను అత్యంత వైభవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. గిరిజన ఆదివాసీ ఆచార సంప్రదాయాలతో నాలుగు రోజుల పాటు జరిగే ఈ పండుగను వన దేవతల మహోత్సవంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.
కోటిన్నరకు పైగా భక్తులు తరలివచ్చే ఈ జాతరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేనివిధంగా ఘనంగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. మేడారం తల్లుల స్ఫూర్తితో జరిపిన ప్రజాస్వామ్య పోరాటం ఫలితంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడిందన్నారు.
రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తల్లుల చెంత ప్రభుత్వం రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నిర్వహించిందన్నారు. జనంకోసం ప్రాణాలైనా ఇవ్వాలనే సందేశం ఇచ్చిన మేడారం సమ్మక్క, సారలమ్మ తల్లుల స్ఫూర్తితో రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుతామని చెప్పారు.









