ప్రభుత్వ ఖర్చుతో నిమ్స్ లో చికిత్స
కోలుకుంటున్న విద్యార్థిని కార్తీక
హైదరాబాద్: గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందపడి తీవ్రగాయాలపాలైన విద్యార్థిని కొయ్యడ కార్తీక కు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను ఆయన ఆదేశించారు. సీఎం సూచన మేరకు హైదరాబాద్ లోని నిమ్స్ లో కార్తీక కు వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తీక కోలుకుంటోంది.
ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తీక ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ మూడో అంతస్తు నుంచి పడిపోయింది. దీంతో విద్యార్థిని నడుము భాగంలో తీవ్రగాయాలయ్యాయి. గురుకుల అధికారులు కార్తీకను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కి ,అక్కడి నుంచి నిమ్స్ కు తరలించారు.
నిమ్స్ న్యూరో సర్జన్ అసిస్టెంట్ ఫ్రొఫెసర్ డాక్టర్ తిరుమల్ బృందం మంగళవారం నాడు కార్తీక కు ఆపరేషన్ నిర్వహించింది.. ప్రస్తుతం ఐసీయులో విద్యార్థిని కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. కార్తీక కు కావాల్సిన వైద్యం ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరించనున్నది.
ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తో మాట్లాడి కార్తీక కోలుకునేంత వరకు వైద్యం అందించాలని సూచించారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కూడా కార్తీక ఆరోగ్య పరిస్థితిపైన ఎప్పటికప్పుడు నిమ్స్ డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు.