Cm Chandrababu News Latest | క్షేత్రస్థాయిలో ప్రజల మధ్య తిరుగుతూ వారితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటూ ఉండటం… వాటిని దృష్టిలో పెట్టుకుని తగిన కార్యక్రమాలు రూపొందించుకున్నప్పుడే పాలన అర్థవంతంగా అనిపిస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, వడ్లమానులో సీఎం పర్యటించారు. కులవృత్తులు చేసుకునే వారి ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
బీసీ వర్గానికి చెందిన నక్కబోయిన కోటయ్య, రంగమ్మ దంపతులను కలిశారు. పశువుల పాడి మీద ఆధారపడి జీవనోపాధి పొందుతున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు సీఎం తెలిపారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి, ప్రజలకు అవసరమైన సంపూర్ణ పోషకాహారాన్ని అందించడానికి పాడి పరిశ్రమ ఎంతో కీలకమని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు.
అనంతరం బత్తుల జగన్నాథం క్షౌరశాలకు వెళ్లి ఆయన ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయన వృత్తికి అవసరమైన కొన్ని అధునాతన పనిముట్లను జగన్నాథంకి సీఎం అందజేసారు. వారి ఇంటి నిర్మాణానికి, కొత్త సెలూన్ నిర్మాణానికి సహాయ చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.