Kerala Nurse Nimisha Priya | యెమెన్ (Yemen) దేశంలో ఉరిశిక్ష పడిన కేరళ నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. నర్సు ఉరిశిక్షను నిలిపివేయడానికి ప్రస్తుతం తమ వద్ద పెద్దగా మార్గాలేమీ లేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
భారత్-యెమెన్‌ల మధ్య దౌత్య సంబంధాలు లేవని, ఉరిశిక్షను వాయిదా వేయడం లేదా నిలిపివేయడం సాధ్యమేనా అని ప్రాసిక్యూటర్‌కు లేఖ రాసినట్లు అటార్నీ జనరల్ వెంకటరమణి కోర్టుకు తెలియజేశారు. యెమెన్ విషయంలోని సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదని తెలిపారు.
బ్లడ్ మనీ అనేది కేవలం ప్రైవేటు సంప్రదింపులు మాత్రమే అని పేర్కొన్నారు. న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ, ఈ ఘటన చోటుచేసుకున్న విధానం చాలా బాధాకరమని, ఒకవేళ నిమిష ప్రాణాలు కోల్పోతే అది విచారకరమని వ్యాఖ్యానించారు.
మరోవైపు నిమిష ప్రాణాలను కాపాడాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నిన్న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంలో జోక్యం చేసుకొని ఆమెను విడిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు లేఖను పంపించారు.